Telugu girl Nikitha Godishala murdered in USA : నేటి కాలంలో ఎవరు ఎటువంటి వారో అర్థం కావడం లేదు. ప్రేమించిన వారి దగ్గర నుంచి మొదలు పెడితే జీవిత భాగస్వాముల వరకు మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఈ తరహా సంఘటనలు మనదేశంలోనే అనుకుంటే.. అగ్రరాజ్యం అమెరికాలో కూడా జరుగుతున్నాయి. అమెరికాలో జరిగిన ఘటనలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా కొద్దీ దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.
కొలంబియా ప్రాంతంలో..
అమెరికా దేశంలో మేరీ ల్యాండ్ లోని కొలంబియా ప్రాంతంలో నిఖిత గొడిశాల అనే యువతి(27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అది కూడా ఒక అపార్ట్మెంట్లో నిర్జీవంగా పడింది. ఆ అపార్ట్మెంట్ లో ఆమె స్నేహితుడు ఉంటున్నాడు. పోలీసులకు ఈ సమాచారం అందిన నేపథ్యంలో అపార్ట్మెంట్లో విస్తృతంగా పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిశీలిస్తుంటే.. నిఖిత స్నేహితుడు కూడా కనిపించలేదు.
ఆమె స్నేహితుడి ఫిర్యాదు ఆధారంగా..
వాస్తవానికి పోలీసులకు నిఖిత స్నేహితుడు ఫిర్యాదు చేశాడు. తను పని మీద బయటకు వెళ్లిందని.. అప్పటి నుంచి కనిపించడం లేదని అర్జున్ శర్మ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఖితకు 27 సంవత్సరాల వయసు ఉంటే.. అర్జున్ శర్మకు 26 సంవత్సరాల వయసు ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో నిఖిత డిసెంబర్ 31న ఎల్లిట్ సిటీలో చూశానని అర్జున్ శర్మ చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
సీసీ కెమెరాలు పరిశీలించగా..
నిఖిత ను వెతికే క్రమంలో పోలీసులు అనేక విధాలుగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత ఆమె అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్మెంట్ లో పోలీసులకు వెళ్లినట్టు కనిపించింది. పోలీసులు వారిద్దరూ కలిసి అపార్ట్మెంట్లోకి వెళ్లినట్టు గుర్తించారు. అర్జున్ శర్మ, నిఖిత మధ్య ఏదో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అర్జున్ శర్మకు ఫోన్ చేస్తే అతడి నెంబర్ వినియోగంలో లేదు. సీసీ కెమెరాలలో కనిపించిన దృశ్యాల ప్రకారం డిసెంబర్ 31న వారిద్దరు కలిసి అపార్ట్మెంట్లోకి వెళ్లారు. అంతకుముందే వారిద్దరి మధ్య పరిచయం ఉంది.. ప్రేమ, సహజీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని.. ఆవేశంలో తట్టుకోలేక అర్జున్ చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
పారిపోయాడు..
డిసెంబర్ 31న ఆమెను రాత్రి 7:30 నిమిషాలకు అర్జున్ చంపేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిఖిత ను హత్య చేసిన తర్వాత అర్జున్ ఇండియాకు పారిపోయాడు. ఇండియాకు పారిపోయిన అర్జున్ ను గుర్తించడానికి పోలీసులు ఫెడరల్ అధికారుల సాయం కోరారు. నిఖిత కొద్దిరోజుల నుంచి కనిపించకపోవడంతో ఆమె స్నేహితులు గందరగోళానికి గురయ్యారు. ఆమె ఫోటోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ఆమె హత్యకు గురిందని అమెరికా పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. నిఖిత స్వస్థలం సికింద్రాబాద్ అని తెలుస్తోంది. ఆమె కుటుంబానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం నిఖిత అమెరికా వెళ్ళినట్టు సమాచారం.