KCR Assembly Entry : అసలే ఇప్పుడు చలికాలం.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బయటికి రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఇటువంటి వాతావరణం ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. వాతావరణం వేడెక్కింది.. అలాగని ఇదంతా సూర్యుడు ఉదయించడం ద్వారా వచ్చిన వేడి కాదు.. రాజకీయ నాయకులు సృష్టించిన వేడి.. రేపటి నుంచి తెలంగాణలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీలో రేపటి నుంచి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇన్ని రోజులపాటు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ శాసనసభకు రావడంలేదని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. దమ్ముంటే చర్చకు రావాలని పట్టుబడుతున్నారు. ఇన్నిరోజుల పాటు రేవంత్ రెడ్డి వరుసగా సవాళ్లు విసిరినప్పటికీ.. కెసిఆర్ రాలేదు.. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ ను కెసిఆర్ స్వీకరించారు. ఇన్ని రోజులపాటు వ్యవసాయ క్షేత్రంలో గడిపిన ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్ లోని తన నివాసానికి వచ్చారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో.. అనంతరం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామని కెసిఆర్ ఇప్పటికే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బలంగానే కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై అటు కాంగ్రెస్ పార్టీ.. ఇటు భారత రాష్ట్ర సమితి మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వేడివేడిగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పాలమూరు రంగారెడ్డి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఇప్పటికే ఆయన కుమార్తె కవిత ఆరోపించారు.. రేవంత్ ప్రభుత్వం పై కూడా ఆమె అదే స్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి పై చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రభుత్వం ప్రత్యేకంగా బుక్లెట్లు పంపిణీ చేసింది. ఇందులో ఉన్న వివరాలను శాసనసభలో సమయం వచ్చినప్పుడు చెప్పాలని సూచించింది.
మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులతో తీవ్రంగా మదనం సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో గులాబీ పార్టీ చేసిన తప్పులను శాసనసభ వేదికగా బయట పెట్టాలని రేవంత్ భావిస్తుంటే.. అధికార పార్టీకి గట్టి కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. మొత్తంగా చూస్తే అటు ముఖ్యమంత్రి.. ఇటు ప్రతిపక్ష నాయకుడి మధ్య హోరాహోరీగా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.