Teenmar Mallanna : శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ప్రముఖ పాత్రికేయుడు తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన అనుచరులు క్షేత్రస్థాయిలో వేగంగా పని చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో కమిటీలను నియమిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం చాప కింద నీరు లాగా సాగిపోతోంది. చివరికి బయటికి వచ్చింది. దీంతో తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీ ఖాయమని స్పష్టమైనది.
కాంగ్రెస్ గుర్తు ద్వారా శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న భారీ మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యుడైనప్పటికీ.. ఆయన మొదటి నుంచి కూడా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యంగా బీసీల గణన విషయంలో ప్రభుత్వంతో విభేదిస్తున్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. పార్టీ విధానాలు సరిగా లేవని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. సహజంగానే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇబ్బందిగా అనిపించింది.. దీంతో తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసింది. ప్రస్తుతమైన సస్పెండ్ నేతగానే కొనసాగుతున్నారు.
కానీ ఇతనే ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో మల్లన్న రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దిగువ స్థాయి వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ పార్టీ లక్ష్యమని తీన్మార్ మల్లన్న భావిస్తున్నారు. ఈ నెల 17న విధివిధానాలు ప్రకటిస్తారని.. జెండా ఆవిష్కరణ కూడా చేస్తారని తెలుస్తోంది. తన సొంత ఛానల్ ద్వారా 7200 ఉద్యమాన్ని చేపట్టారు. ఆ తర్వాత రీ కాల్ అనే అంశాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. ఇప్పుడు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పార్టీ విషయంలోనైనా స్థిరంగా ఉంటారా.. లేదా దానిని కూడా తాత్కాలికం చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.
తీన్మార్ మల్లన్న రాజకీయంగా ఎదగడానికి ఇటీవల ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత జిల్లా అయిన నల్గొండలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులకు బూట్లు.. దుస్తులు.. ఇతర పరికరాలు పంపిణీ చేస్తున్నారు. పలు జిల్లాలలో పర్యటనలు కూడా చేపడుతున్నారు. బీసీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐక్యంగా ఉండాలని.. సమస్యలు పరిష్కరించుకోవాలని.. అప్పుడే బీసీలు రాజకీయంగా ఎదుగుతారని తీన్మార్ మల్లన్న పిలుపునిస్తున్నారు. మరి ఆయనే ఇచ్చే పిలుపు ఎంత మేరకు పనిచేస్తుంది.. ఏ స్థాయిలో బీసీలను కదిలిస్తుందనేది త్వరలోనే తేలుతుంది.