Shubman Gill birthday : అది ఇంగ్లాండ్ సిరీస్.. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా కు వరుస ఓటములు.. పైగా అశ్విన్, రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించారు.. ఈ క్రమంలో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్న ఎదురయింది.. చాలామంది రకరకాల పేర్లను ప్రస్తావించారు. గంభీర్ మాత్రం గిల్ నమ్మకం ఉంచాడు. అతని ప్రతిపాదనను చాలామంది తిరస్కరించారు. కానీ గంభీర్ మాత్రం గిల్ మీద పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచాడు. అప్పటికి గిల్ వయసు 25 సంవత్సరాలు మాత్రమే. పాతికేళ్ల వయసులోనే భారత జట్టు నాయకత్వ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని అందరూ ప్రశ్నించారు. కానీ విమర్శకుల నోళ్లకు తాళం వేస్తూ.. మాజీ సీనియర్లకు తన ఆటతోనే సమాధానం చెప్పాడు గిల్. టీమిండియా ఇంగ్లాండ్ మీద టెస్ట్ సిరీస్ గెలవలేకపోయినప్పటికీ.. ఇంగ్లాండ్ కి మాత్రం ట్రోఫీని దక్కించుకునే అవకాశం ఇవ్వలేదు. హోరా హోరిగా పోరాడి రెండవ టెస్ట్ ను గెలిచిన విధానం.. నాలుగో టెస్ట్ ను డ్రా చేసుకున్న విధానం.. ఐదవ టెస్ట్ గెలిచిన విధానం అద్భుతం.. అనితర సాధ్యం. ఎప్పుడైతే ఇంగ్లాండ్ గడ్డమీద టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసిందో.. గిల్ ముందుండి జట్టును నడిపించాడో.. అప్పుడే అతడి పేరు మార్మోగిపోయింది. ఇతడిలో విషయం ఉంది.. జట్టును ముందుండి నడిపించే సత్తా ఉంది.. అని అందరికీ నమ్మకం కలిగింది.
గిల్ ఇక్కడిదాకా చేరుకోవడం వెనక చాలా కష్టం ఉంది. మైదానంలో నిద్ర లేని రాత్రులు గడిపాడు. తన తోటి స్నేహితులు ఉన్నత చదువులు చదువుతూ ఉంటే అతడు మాత్రం క్రికెట్ బ్యాట్.. బంతులతో కుస్తీపట్టాడు. కొన్ని సందర్భాలలో అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెందాడు. అయినప్పటికీ తనమీద తాను నమ్మకం కోల్పోలేదు. తనను తాను మలచుకొని.. రాటు తేలాడు. తిరుగులేని ఆటగాడిగా అవతరించారు.. ఇప్పటివరకు 113 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన గిల్.. ఆరువేల పరుగులు చేశాడు. ఇందులో 18 శతకాలు, 25 అర్థ శతకాలు ఉన్నాయంటే..గిల్ బ్యాటింగ్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. పాతికేళ్లకే టీమ్ ఇండియాకు సుదీర్ఘ ఫార్మాట్లో నాయకత్వం వహించే అవకాశం గిల్ కు మాత్రమే దక్కింది. పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియాకు ఉపసారథిగా అవకాశం వచ్చింది.
ఇవీ గిల్ ఘనతలు
సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా సారధిగా దూకుడైన ఆట తీరు కొనసాగించాడు. పర్యటక జట్టుగా వెళ్లి.. ఆతిధ్య జట్టుకు చుక్కలు చూపించాడు.
సుదీర్ఘ ఫార్మాట్ విభాగంలో ఒక మ్యాచ్లో 250+, 150+ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
పరిమిత ఓవర్లు, సుదీర్ఘ ఫార్మేట్ లో ద్వి శతకం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు గిల్.
ఒక టెస్ట్ సిరీస్ లో సారధిగా 754 పరుగులు చేసి.. రెండవ అత్యున్నత ఘనతను తన పేరు మీద రాసుకున్నాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో ఒక టెస్టు సిరీస్లో నాలుగు శతకాలు చేసి రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండవ ఆటగాడిగా పేరుపొందాడు.
పరిమిత ఓవర్లలో సెకండ్ హైయెస్ట్ యావరేజ్ (59.04) తో కొనసాగుతున్నాడు.
పరిమిత ఓవర్లలో 2000 పరుగులను కేవలం 38 ఇన్నింగ్స్ లో మాత్రమే పూర్తిచేసి అదరగొట్టాడు గిల్.
పరిమిత ఓవర్లలో ద్వి శతకం చేసిన యువ ఆటగాడిగా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో సెంచూరియన్ గా నిలిచిన యువ ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు గిల్.
2018 అండర్ – 19 విశ్వ సమరంలో కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
2022లో ఐపీఎల్ సాధించిన గుజరాత్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
2023 ఐపీఎల్ లో నారింజరంగు క్యాప్ సొంతం చేసుకున్నాడు.
2023లో టీమిండియా సాధించిన ఆసియా కప్ లో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
2025 లో టీమ్ ఇండియా సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
నేడు 26వ పడిలోకి అడుగుపెడుతున్న గిల్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఓకే తెలుగు. అతడు ఇలాంటి పుట్టినరోజులు.. అద్భుతమైన విజయాలు మరిన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది.