సోనూసూద్ కరోనా సమయంలో చాలా మంది వలస కూలీలను వారివారి సొంత గ్రామాలకు చేర్చి వారి పాలిట దేవుడు అయ్యాడు. సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో అందరి దృష్టిలో హీరో అనిపించుకున్నాడు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కానీ ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం మాత్రం కొందరికి మాత్రమే ఉంటుందని చూపించాడు సోనుసూద్.
తాజాగా సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ముంబయిలోని ఆయన నివాసంలతోపాటు.. నాగ్ పూర్, జైపుర్ లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తైన తర్వాత ఐటీ అధికారులు సోనూసూద్ రూ. 20 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని వెల్లడించారు. తాజాగా సోనూసూద్ తనపై జరిగిన దాడులకు సంబంధించి ట్విట్టర్ ద్వారా స్పందించారు. నా ఫౌండేషన్ లో ప్రతి రూపాయి కూడా నిరుపేదల జీవితాల కోసం పోగు చేసిందే. మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను ప్రోత్సహించాను.
నాలుగు రోజులుగా నేను ఐటీ అధికారులతో బిజీగా ఉన్నాను. ఆ కారణం వల్లనే మీ సేవలో ఉండలేకపోయాను. ఇప్పడు తిరిగి వచ్చాను అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు సోనూసూద్. ఇటీవల సోనూసూద్ ఢిల్లీ ఆఫ్ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్ ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.