Pawan Kalyan: ప్రజలకు ఎదో చేయాలనే తపన, స్వప్రయోజనాల కోసం కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం తనని తాను తగ్గించుకోవడానికి కూడా సిద్దపడే మనస్తత్వం ఉన్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈయన ఆలోచనలు చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తాది. పవన్ కళ్యాణ్ అంత తేలికగా ఎవరికీ అర్థం కాడు. కానీ అర్థం అయితే మాత్రం అతనిని ఎవ్వరూ వదలలేరు అనడానికి ఉదాహరణ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు. 2019 ఎన్నికలలో దారుణమైన ఓటమిని ఎదురుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నిలబడగలడా, లేడా అనే సందేహం ఆయనని అభిమానించే వారిలో కూడా ఉండేది. కానీ నిలబడి చూపించాడు. 5 ఏళ్ళు తన సొంత చరిష్మా తో పార్టీ ని నడిపి, గడిచిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పొలిటికల్ పార్టీ గా జనసేన ని నిలబెట్టాడు.
అయితే అంతటి విజయాన్ని ఆయన తన తలకు ఎక్కించుకోలేదు, జనాలు పెద్ద బాధ్యతను నెత్తి మీద పెట్టారు, జాగ్రత్తగా పరిపాలించాలి అని మొదటి రోజునే అనుకున్నాడు. తన పార్టీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను కూడా ఆ దిశగా అడుగులు వేసేలా ప్రేరేపించాడు. ఇక ఆయన ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్,అటవీ శాఖ,పర్యావరణం శాఖ,సైన్స్ & టెక్నాలజీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికీ వంద రోజులు పూర్తి అయ్యింది. అంటే ప్రభుత్వం ఏర్పడి కూడా వంద రోజులు పూర్తి అయ్యింది అన్నమాట. ఈ వందరోజుల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో మహత్తరమైన కార్యాలకు శ్రీకారం చుట్టాడు. ఒకమనిషికి మంచి చేయాలనే తపన ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో కేవలం వంద రోజుల్లోనే చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. ఆయన ఈ అతి తక్కువ సమయంలో తీసుకున్న సంచలన నిర్ణయాలలో ఒకటి రాష్ట్రం లో ఉన్న 13,324 గ్రామ పంచాయితీలలో ఒక్క రోజులోనే గ్రామ సభలను నిర్వహించడం. ఈ గ్రామ సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు కోట్ల సంఖ్యలో పాల్గొని, తమ గ్రామాల్లో ఉన్న సమస్యలకు తీర్మానం చేసుకొని, వాటి పరిష్కరణ దిశగా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం 2500 కోట్ల రూపాయిలను ఆరోజు విడుదల చేసారు.
నేడు గ్రామాల్లో వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనను మెచ్చుకొని అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయితీలలో ఇదే మోడల్ ని అనుసరించాలని, అలా అనుసరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన పద్దతులను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించాడట. అంటే అక్టోబర్ 2 వ తేదీన దేశం మొత్తం గ్రామ పంచాయితీలలో పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు చేయబోతున్నారు అన్నమాట. ఒక వ్యక్తి మంచి ఆలోచన ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో దీనిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.