MS Dhoni farmhouse : రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ గా అతనికి ఉద్యోగం వచ్చింది. పేద కుటుంబం కావడంతో ఆ ఉద్యోగాన్నే అతడు గొప్పగా భావించేవాడు. అలాగని తన వ్యాపకాన్ని వదులుకునేవాడు కాదు. ఎందుకంటే అతని వ్యాపకం క్రికెట్. ఎప్పటికైనా సరే టీమిండియా కు ఆడాలనేది అతడికల. ఆ కలను నెరవేర్చుకోవడానికి అతడు చాలా కష్టాలు పడ్డాడు. చివరికి సాకారం చేసుకున్నాడు. టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారధిగా నిలిచాడు. 2007 లో టి20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించి టీమిండియా కు తిరుగులేని స్థాయిని అందించాడు. ఇదంతా చదువుతుంటే మీకు గుర్తుకొస్తున్న పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఎస్.. అతడే మహేంద్ర సింగ్ ధోని.
మహేంద్ర సింగ్ ధోని టీం ఇండియాకు మాత్రమే కాదు, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా అద్భుతమైన విజయాలు అందించాడు. ఏకంగా ఐదుసార్లు ఆ జట్టును విజేతగా నిలిపాడు. తద్వారా తన పేరు మీద అద్భుతమైన రికార్డులను సృష్టించుకున్నాడు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే తత్వం ధోనిది. అందువల్లే అతడిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానిస్తుంటారు. ఆరాధిస్తూ ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్ కు అతడు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇప్పటికీ అతడి స్టామినా ఏమాత్రం తగ్గలేదు. అటువంటి ధోనికి క్రికెట్ తర్వాత వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ప్రకృతిలో గడపడం అంటే మరింత ఇష్టం.
చిన్నప్పుడు పేదరికం చూసిన ధోని.. తనకంటూ ఆర్థిక స్థిరత్వం ఇచ్చిన తర్వాత సొంతంగా వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏడెకరాల భూమిని కొనుగోలు చేసి, అందులో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకున్నాడు. చుట్టూ పండ్ల మొక్కలు, వాటికి రక్షణగా కంచే ఏర్పాటు చేసుకున్నాడు. ఖాళీ సమయాలలో వ్యవసాయ క్షేత్రానికి వస్తుంటాడు ధోని. అక్కడే సరదాగా గడుపుతుంటాడు. కుటుంబంతో కలిసి వ్యవసాయ క్షేత్రాన్ని కలియ తిరుగుతుంటాడు. ట్రాక్టర్ ద్వారా దున్నడం, ఇతర పనులు చేపడుతుంటాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ధోని వ్యవసాయ క్షేత్ర వివరాలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు ధోని వ్యవసాయ క్షేత్రం అద్భుతంగా ఉంది. వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన భవనం కూడా అందంగా కనిపిస్తోంది. వ్యవసాయ క్షేత్రంలో ఆ భవనాన్ని అత్యద్భుతమైన సౌకర్యాలతో ధోని నిర్మించుకున్న తీరు ఆకట్టుకుంటున్నది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో లక్షలలో వీక్షణలు సొంతం చేసుకుంది.