
నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలోనే తొలి ఫలితం అక్కడ వెలువడింది. ఆమంచర్ల ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 760 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. దీంతో పాటు సౌత్ మోపూరు స్థానంలోనూ వైకాపా అభ్యర్థి గెలిచారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. కొవ్వూరులోని బ్రహ్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో కొవ్వూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఓట్లు లెక్కిస్తున్నారు. జేసీ గణేశ్ కుమార్, నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కౌంటింగ్ పూర్తి కానుందని జిల్లా కలెక్టర్ చక్రధరబాబు తెలిపారు.
ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న ఎస్సై సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో చోటు చేసుకుంది. ట్రాపిక్ ఎస్సైగా పనిచేస్తున్న అంజాద్ అలీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అధికారులు, ఇతర సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనంతపురం జిల్లా మడకశిరలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 11 చెల్లని ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సిబ్బంది తేల్చారు. ధ్రువీకరణ పత్రాలు జత చేయకపోవడంతో ఆ ఓట్లు చెల్లనివిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏటూరులోని సర్ సీఆర్ రెడ్డి కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లెక్కింపు కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాయింట్ కలెక్టర్ అంబేద్కర్, ఆర్టీవో రచన పరిశీలించారు. లెక్కింపు పై ఎన్నికల సిబ్బందికి వారు పలు సూచనలు చేశారు.