
AP Election Counting: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కౌంటింగ్ మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలు పెట్టారు. ఈ రోజే సాయంత్రం ఎన్నికల కమిషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. అధికారుల కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎస్ఈసీ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఆయా జిల్లాల కలక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేయరాదని సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఎస్ఈసీ, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ, 660 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వివిధ కారణాలతో 375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 2020 మార్చి 7న మొత్తం 9 వేల 672 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో 2371 ఏకగ్రీవం అయ్యాయి. పలు చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 7220 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. అయితే వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ లో అన్ని చోట్ల ముందంజలో నిలిచినట్లు తెలుస్తోంది.
మొత్తం 18,782 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 660 జెడ్పీటీసీ స్థానాలకు 2020 మార్చి 7న నోటిఫికేషన్ జారీ చేశారు. 8 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ స్థానాలకు 2058 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
రాష్ట్ర వ్యాప్తంగా 275 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 41 వేల సిబ్బంది పాల్గొననున్నారు. అయితే మొదలు ఈనెల 10నే కౌంటింగ్ జరగాల్సి ఉన్నా టీడీపీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు తీర్పు మేరకు కౌంటింగ్ ను నేడు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.