Kavuri Sambasiva Rao health news : కాదేది వార్తలకు అనర్హం అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే ఎలాంటిదైనా వార్తను మలుచుకోవచ్చు కానీ.. కొన్నింటి విషయంలో మీడియా చూపుతున్న అతి విమర్శలకు గురిచేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు( Kavuri sambasiva Rao ) విషయంలో మీడియా చేసిన అతిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావును కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. కానీ ఆయన చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దాదాపు ప్రతి మీడియా ఛానల్ కూడా కావూరి సాంబశివరావు ఇక లేరని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేసింది. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తగా ఖండించారు. తాము ప్రకటించే వరకు ఇలాంటి వ్యాఖ్యలు, ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
* సినీ ప్రముఖుల విషయంలో.. సెలబ్రిటీలతో( celebrities) పాటు వివిధ రంగాల ప్రముఖుల విషయంలో మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. గతంలో కూడా ఇటువంటి వార్తలను ప్రచురించారు. ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ అయితే అప్పట్లో బహిరంగంగానే కన్నీరు పెట్టుకున్నారు. తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కమెడియన్ గా ఎదిగిన వేణుమాధవ్.. అప్పట్లో దీర్ఘకాలిక వ్యాధికి గురయ్యారు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో కూడా ఆయన చనిపోయారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిపై స్పందించిన వేణుమాధవ్ తీవ్ర ఆవేదనతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు దీనిని గుర్తు చేసుకుని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
* వెంటిలేటర్ పై ఉండగా ప్రచారం..
సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కావూరి సాంబశివరావు. ఆయన ఐదుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అటువంటి వ్యక్తి ఈనెల 7న బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన స్వయాన విశాఖ మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి వియ్యంకుడు. ప్రస్తుత విశాఖ ఎంపీ శ్రీ భరత్ తాత. కావూరి సాంబశివరావు కుమార్తె కుమారుడే శ్రీ భరత్. అందుకే మొన్న మంత్రి నారా లోకేష్ సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం సాంబశివరావు పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్ పై ఉన్న ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఇంతలోనే ఆయన చనిపోయారంటూ మీడియాలో రావడం పై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇటువంటి ప్రకటనలు మానుకోవాలని వారు కోరారు.