
రాజస్థాన్ రాయల్స్ ఓటమిపై పంజాప్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. ఇంతకు ముందు కూడా తమ జట్టు ఇలాంటి ఓటములు చూసిందని చెప్పాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సునాయాస విజయం సాధించే అవకాశం ఉన్నా ఆఖరి ఓవర్ లో రాజస్థాన్ బౌలర్ కార్తీక్ త్యాగి అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో 8 వికెట్లు చేతిలో ఉండి, సాధించాల్సిన పరుగులు నాలుగే అయినా రాహుల్ టీమ్ అనూహ్య ఓటమి చవిచూసింది. దీనిపై రాహుల్ మాట్లాడుతూ ఈ ఓటమిని స్వీకరించడం చాలా కష్టం.
ఇది వరకు కూడా మా జట్టు ఇలాంటి అనుభవాలు చవిచూసింది. మేం ఒత్తిడిని ఎలా జయించగలమో చూడాలి. అయితే, మేం గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోలేదని అనిపిస్తోంది. ఇకపై బలంగా పుంజుకొని మిగతా ఐదు మ్యాచ్ లు గెలిచేందుకు ప్రయత్నిస్తాం. మేం బంతితో మంచి ప్రదర్శన చేశాం. అవసరమైన సమయాల్లో వికెట్లు తీశాం. ఇక మా బ్యాటింగ్ లో నేనూ మయాంక్, మార్ క్రమ్ పరుగులు చేయడం చాలా ముఖ్యమైన విషయం.
కొన్ని సార్లు ముందుగానే మ్చాచ్ ను ముగించాలని ప్రయత్నిస్తే అది ప్రత్యర్థులకు కలిసివచ్చే ప్రమాదం ఉంటుంది. అని పంజాబ్ కెప్టెన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కార్తీక్ త్యాగి మాట్లాడుతూ పొట్టి క్రికెట్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే నమ్మకం కలిగింది. అలాంటి మ్యాచ్ లెన్నో చేశాను. ఇక నేను ఈ మ్యాచ్ లో ఇలాంటి అత్యద్భుత ప్రదర్శన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు నా బౌలింగ్ లో చిన్న సమస్య ఉండేది. దానిపై సరైన ఫీడ్ బ్యాక్ తీసుకుని తర్వాత దృష్టిసారించా. అలా నా బౌలింగ్ ను మెరుగుపర్చుకున్నా అని కార్తీక్ త్యాగి తెలిపాడు.