woman poisoned to lover in Kerala
Crime News : అప్పట్లో నేపాల్ యువరాజు చేసిన దారుణం గురించి నేటికీ మాట్లాడుకుంటున్నాం. అతడు ప్రేమ గురించి తన కుటుంబాన్ని దూరం చేసుకుంటే.. ఈమె మాత్రం పెళ్లి కోసం ప్రేమికుడినే చంపేసింది. అతడిని నమ్మించి విషం ఇచ్చింది. ఆ తర్వాత అతడిని చంపింది. అయితే ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి కుదరడంతో.. తన ప్రేమ బంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగానే ప్రియుడికి విషం ఇచ్చి చంపేసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. అయితే ఈ కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ యువతికి మరణశిక్ష విధించింది. కేరళ రాష్ట్రంలో ఓ కాలేజీలో 23 సంవత్సరాల షారన్ రాజ్, 24 సంవత్సరాల గ్రీష్మ ఒకే కాలేజీలో చదువుకున్నారు. వీరు ప్రేమలో పడ్డారు.. అయితే గ్రీష్మ కు వేరే యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో గ్రీష్మ ఈ విషయాన్ని రాజ్ కు చెప్పేసింది. దానికి అతడు ఒప్పుకోలేదు. అయితే ఇది కాస్త తనకు ఇబ్బందికరంగా మారుతుందని భావించిన గ్రీష్మ.. ఏ ప్రేమికురాలు చేయకూడని పనిచేసింది. రాజ్ ను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పండ్ల రసంలో మాత్రలు కలిపి రాజ్ కు ఇచ్చింది. అయితే అది చేదుగా ఉండడంతో తాగడానికి ఇష్టపడలేదు.. దీంతో మరో ప్లాన్ వేసింది. 2022 అక్టోబర్ 14న తమిళనాడు రాష్ట్రంలోని( కన్యాకుమారి జిల్లా రామవరమంచిరై ప్రాంతంలో తన ఇంటికి రాజ్ ను గ్రీష్మ పిలిపించుకుంది. ఆయుర్వేద టానిక్ లో విషం కలిపింది. దాన్ని తాగిన రాజ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. టానిక్ లో కలిపిన విషం వల్ల రాజ్ అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 11 రోజులు అతడు చికిత్స పొందిన తర్వాత అక్టోబర్ 25న కన్నుమూశాడు. పోస్టుమార్టం లో అతడిపై విష ప్రయోగం జరిగినట్టు తెలిసింది..
గ్రీష్మ కు కుటుంబ సభ్యులు కూడా సహకరించారు
రాజ్ ను చంపడానికి గ్రీష్మకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. దీంతో ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక నాటి నుంచి నేటి వరకు ఈ కేసు పై విచారణ జరుగుతూనే ఉంది. ఇక ఈనెల 17న తిరునంతపురంలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గ్రీష్మను దోషిగా ప్రకటించింది. సోమవారం మరణ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆమెకు సహకరించిన మేనమామ నిర్మల్ కుమార్ కు మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. గ్రీష్మ తల్లి సింధును కోర్టు నిర్దోషిగా ప్రకటించడం విశేషం. రాజ్ గ్రీష్మను ప్రేమించి .. తన జీవితానికి అర్ధాంతరంగా ఎండ్ వేసుకున్నాడు. రాజ్ కన్ను మూసినప్పుడు అతడి స్నేహితులు ఆందోళన చేశారు. గ్రీష్మ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించారు. వారు ఇచ్చిన ఆధారాల ప్రకారమే పోలీసులు దర్యాప్తు చేయగా మరిన్ని దారుణ విషయాలు తెలిసాయి. అందువల్లే గ్రీష్మ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.