KCR : చాలాకాలం తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు.. కొంతకాలంగా వరుస ఓటములు ఎదుర్కొంటూ.. అంతర్గతంగా కూడా ఇబ్బంది పడుతున్న పార్టీకి జవసత్వం కల్పించాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా శనివారం రాత్రి నంది నగర్ వచ్చారు.. ఆ తర్వాత ఆదివారం భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఇతర నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏ అంశాలపై సమావేశం నిర్వహిస్తామో గులాబీ పార్టీ ముందుగానే మీడియాకు లీకులు ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ అనుకూల మీడియా డబ్బాలు కొట్టింది.
సమావేశంలో కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ మాటలను మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణ రాష్ట్రం పాలిట శాపం అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వివక్షకు గురైందని ఆరోపించారు. పాలమూరు జిల్లాకు రావాల్సిన నీళ్లు ఇప్పటికీ రావడంలేదని.. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు 174 టీఎంసీల నీళ్లు రావాలని, కానీ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్సీ యాక్ట్ ప్రకారం కూడా అదే అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. వాస్తవానికి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల కోణంలో మాట్లాడితే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటే.. తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద అన్యాయమని కెసిఆర్ అనడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది.
గులాబీ పార్టీ మొదటి నుంచి కూడా సెంటిమెంట్ రాజకీయాలను మాత్రమే నమ్ముకుంది. 2014, 2018 ఎన్నికల్లో సెంటిమెంట్ రగిలించి అధికారాన్ని దక్కించుకుంది. 2023లో ఈ పాచిక పారలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా 0 ఎంపీ సీట్లను దక్కించుకుంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో.. అంతకుముందు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ అనుకున్న స్థాయిలో స్థానాలు రాలేదు.
మరికొద్ది రోజుల్లో జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో గులాబీ దళపతి రంగంలోకి వచ్చారు. భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు..”ఒకప్పుడు యూరియా ఇంటికి, చేరు వద్దకు వచ్చేది. ఇప్పుడు కుటుంబమంతా లైన్లో నిలబడే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసింది. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయింది. రైతులను ఆదుకోవడానికి.. వారి పొలాలకు నీరును అందించడానికి నిర్మించిన చెక్ డ్యాములు కూడా పేల్చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. గర్వంగా ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శించలేదు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలయితే గులాబీ పార్టీ సత్తా తెలిసేది. నన్ను తిట్టడం, చావాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానమని” కెసిఆర్ పేర్కొన్నారు.
చాలా రోజుల తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చిన కేసీఆర్.. చాలా విషయాలు మాట్లాడతారని అందరూ అనుకున్నారు.. కానీ ఆయన సెంటిమెంట్ రాజకీయాలని మళ్ళీ నమ్ముకున్నారు. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒకప్పటి మాదిరిగా లేదు.. అక్కడివాళ్ళు ఇక్కడ.. ఇక్కడి వాళ్ళు అక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ప్రజలు కూడా స్నేహభావంతోనే ఉన్నారు. 2023 లో ఎన్నికలు జరిగే ఒకరోజు ముందు నాగార్జునసాగర్ డ్యాం మీద ఏపీ పోలీసులు ఎంతటి హంగామా చేశారో అందరికీ తెలుసు. అప్పుడే తెలంగాణ ప్రజలు తమ మనోగతాన్ని ఓటు రూపంలో వెల్లడించారు. అలాంటప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఏపీ ఏర్పాటు తెలంగాణ శాతం అనే మాటలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది వేచి చూడాల్సి ఉంది.