KCR, Revanth Reddy : దేశంలో మిగతా రాష్ట్రాలు వేరు.. తెలంగాణ వేరు. తెలంగాణ ఉత్తి పుణ్యానికి రాలేదు. బలిదానాల మీద.. ఆత్మ త్యాగాల మీద వచ్చింది. ఆశయాల సాధన మీద ఏర్పడింది. అందుకే తెలంగాణ అంటే ఒక పౌరుషం.. తెలంగాణ అంటే బలమైన ఆశయం. తెలంగాణ అంటే పిడికిలి బిగించిన నినాదం. సబ్బండవర్ణాలు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు, నిరసనలు, మిలియన్ మార్చ్ లు, వంటా వార్పులు చేస్తేనే తెలంగాణ ఏర్పడింది. అతడు తెలంగాణలో నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తే జాలి కలుగుతుంది.
తెలంగాణలో మర్యాదలు ఎక్కువ గా ఉంటాయి. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగితే తిట్టే తిట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉద్యమాన్ని శంకించిన వారికి.. తెలంగాణ ప్రజల నుంచి ఎటువంటి తిట్లు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సామాజిక ఐక్యత తెలంగాణ ప్రజల్లో నిండి ఉంది కాబట్టి స్వరాష్ట్ర సాధన సాధ్యమైంది. అంతటి గొప్ప విద్వత్తు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు బాధ కలిగిస్తున్నాయి. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి.
రాజకీయ నాయకులు అధికారం కోసం మాత్రమే పాకులాడుతారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది వట్టి మాటలు మాత్రమే. ఏదో రాజకీయ ప్రాపకం కోసం అభివృద్ధి చేసినట్టు.. సంక్షేమానికి పాటుపడినట్టు కలరింగ్ ఇస్తుంటారు. లేకపోతే 2014లో మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడింది. కెసిఆర్ దిగిపోయే నాటికి రెవెన్యూ లోటుకు దిగజారింది. రేవంత్ పరిపాలనలో కూడా అదే సన్నివేశం కొనసాగుతోంది.. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిషరీస్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీనిని బట్టి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ ఇలా కావడానికి ముమ్మాటికి రాజకీయ నాయకులు కారణం. అధికారకాంక్ష.. స్వార్థం.. భారీగా వెనకేసుకోవడం వంటి వాటి వల్ల తెలంగాణ సంపద మొత్తం రాజకీయ నాయకుల జేబుల్లోకి చేరిపోయింది. మద్యం అమ్మకాలు గనుక లేకుంటే తెలంగాణలో ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నిష్టూరంగా ఉన్నప్పటికీ ఇదే కఠిన నిజం.
ఈ కథనం ప్రారంభంలో రాజకీయ నాయకుల వ్యవహార శైలి వల్ల తెలంగాణ పరువు పోతోంది అని చెప్పుకున్నాం కదా.. అది మరోసారి నిరూపితమైంది.. జగిత్యాల సభలో కేసీఆర్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఏం బీమారి వచ్చింది? ఏ మాయ రోగం? లాగులు ఇడ్చి కొట్టాలే.. నన్ను ఏం చేస్తావ్ నా కొడకా.. ఇటువంటి మాటలు మాట్లాడారు. వాస్తవానికి కెసిఆర్ నుంచి ఇంతకంటే గొప్పగా తెలంగాణ సమాజం ఆశించదు. కఠినంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. కాకపోతే కెసిఆర్ గత సంభాషణలు ఉంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం అవుతుంది.
రేవంత్ రెడ్డి కూడా ఇందులో తక్కువ తినలేదు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో జీవన్ రెడ్డిని గట్టిగానే తిట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది.. జీవన్ రెడ్డి ఎందుకు మోసం చేశాడు.. అనే అంశాలపై రేవంత్ లోతుగానే మాట్లాడారు. కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి అదుపుతప్పారు. ఇక కెసిఆర్ ను కూడా అదే స్థాయిలో విమర్శించారు. కర్కోటకుడు అని సంబోధించారు. పాపాత్ముడు అంటూ మండిపడ్డారు.. కెసిఆర్ లాంటి ద్రోహిని వదిలిపెట్టే సవాల్ లేదని శపథం చేశారు.
అటు రేవంత్ రెడ్డి, ఇటు కెసిఆర్ సీనియర్ నాయకులు. తిట్టుకుంటూనే రాజకీయమంటే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. వ్యక్తిగత కోపాలు ఉంటే నేరుగా తేల్చుకోవాలి. అలాకాకుండా జనాన్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడటం ఎందుకు. రాజకీయాలు అంటే వ్యక్తిగత కక్షలకు వేదికలు కావు కదా.. విధానాలపరంగా నేతలను విమర్శించాలి. ఏవైనా తప్పులు చేస్తే ఎండగట్టాలి. అక్రమాలకు పాల్పడితే న్యాయస్థానాలకు ఈడ్చాలి. అలా కాకుండా ఇలా తిట్టుకోవడం.. వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎటువంటి రాజకీయాలకు నిదర్శనమో కెసిఆర్, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇటువంటి రాజకీయాల కోసం కాదు తెలంగాణ తెచ్చుకుంది.