Shiva Charan Reddy: ” రోడ్ల నిండా పోస్టర్లు వేసిర్రు. అందులో మేం కానోస్తలేం. మేము ఎక్కడ. మా ఫోటోలు పెట్టాలని తెల్వదా. మా డాడీ ఫోటో ఏది.. మా డాడీ చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోస్తున్నారు. నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను.. మీ కండ్లకు కనబడతలేదా.. మా ఫోటోలు లేకపోతే మీ ఫ్లెక్సీలు చించేస్తా.. నేను చెప్పిందే ఫైనల్.. రేవంత్ కు చెప్పినా ఏం పీకలేవ్” ఇదీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడిన మాటలు..
ఇటీవల యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కి కార్యవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో ఈశ్వరమ్మ అనే మహిళకు చోటు లభించింది. వై టి డి ఎ పాలకమండలిలో ఆమెకు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు సురేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.. ఆ ఫ్లెక్సీలలో శివ చరణ్ రెడ్డి.. ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు లేవు. ఇది శివ చరణ్ రెడ్డికి ఆగ్రహాన్ని కలిగించింది. ఇంకేముంది తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు. సురేష్ కి ఫోన్ చేసి బూతు మాటలు మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు అని.. చివరికి రాహుల్ గాంధీకి చెప్పుకున్నా ఉపయోగముండదని గట్టిగా హెచ్చరించాడు. తన తండ్రి సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నాడని.. తమ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని శివ చరణ్ రెడ్డి సురేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఈశ్వరమ్మ మీద కూడా రాయడానికి వీలు లేని భాషలో బూతులు తిట్టాడు.
శివ చరణ్ రెడ్డి మాట్లాడిన మాటలను సురేష్ రికార్డ్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం రచ్చకు దారి తీసింది.. గులాబీ పార్టీ సోషల్ మీడియా శివ చరణ్ రెడ్డి మాట్లాడిన మాటలకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. చివరికి సొంత పార్టీ నాయకులకే రేవంత్ రెడ్డి లెక్కలేకుండా పోతుందని.. అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి ఎలా అవుతారని గులాబీ పార్టీ మీడియా ప్రశ్నిస్తోంది.. అయితే శివ చరణ్ రెడ్డి యాదాద్రి పాలకమండలిలో సభ్యుడిగా అవకాశం వస్తుందని భావించారని.. ఈశ్వరమ్మకు ఆ పదవి ఇవ్వడంతో తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే తన స్థాయిని తగ్గించుకొని ఈ స్థాయిలో ఆరోపణలు చేశారని సమాచారం. శివ చరణ్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రిని ఏకవాక్య సంబోధన చేయడం.. అది కూడా దూషించడంతో.. ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
