Ashada Masam: ఆ కవ్వింపులు ఉండవు. చిలిపి చేష్టలు ఉండదు. ముద్దు ముచ్చట్లు కూడా ఉండదు. ఫోన్లలో మాటలు తప్ప.. కలుసుకోవడాలు లేవు. కలిసి ఉండడాలు లేవు. నూతన దంపతుల మధ్య ఇటువంటి ఎడబాటు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తట్టుకోలేనంత వైరాగ్యాన్ని పెంచుతుంది. కాకపోతే ఇది తప్పదు. మన సాంప్రదాయం ప్రకారం ఎడం ఉండాల్సిందే. నెలపాటు ఎడబాటును మోయాల్సిందే. ఇదంతా కూడా ఆషాడం మహిమ.
మిగతా మాసాలు ఎలా ఉన్నా సరే.. ఆషాడంలో మాత్రం దంపతులు దూరంగా ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. చివరికి ఎక్కడో నగరాలలో స్థిరపడిన నూతన దంపతులు కూడా ఈ నెలపాటు దూరంగా ఉండాల్సిందే. ఈ మాసంలో నూతన భర్తల కష్టాలు మామూలుగా ఉండదు. ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వస్తే భార్య పలకరింపు ఉండదు. తలనొప్పిగా ఉంటే వేడివేడి కాఫీ చేతికి అందదు. ఇష్టమైన వంట డైనింగ్ టేబుల్ ముందు కనిపించదు. నచ్చిన బట్టలు ఆల్మరాలో ఉండవు.
ఆషాడ మాసం మొత్తం కొత్త భర్తల పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇక రాత్రి సమయంలో అయితే పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. నిద్ర పట్టదు. భార్య దగ్గరికి వెళ్దామంటే నిబంధనలు అడ్డుగా ఉంటాయి. ఒకవేళ సిగ్గు విడిచి అత్తవారింటికి వెళ్తే.. ఆ పని జరగడానికి అవకాశం లేదని ముందే చెబుతారు. కుశల ప్రశ్నల వరకే ఆగిపోవాలని ముందే చెబుతారు. అందుకే ఆషాడం నూతన భార్యాభర్తలకు గడ్డుకాలం. నేటి కాలంలో ఆధునిక సంస్కృతిని చాలామంది యువతీ యువకులు ఒంట పట్టించుకున్నారు. అయినప్పటికీ ఆషాడ మాసం విషయంలో మాత్రం వారి పప్పులు ఉడకడం లేదు. ఆషాడ మాసంలో భర్తలు పడే ఇబ్బందులకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆ వీడియోను చూసి పాపం భర్త మహాశయులకు ఎంత కష్టమంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
