విజయం సాధించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం మామూలుగా ఉండదు. అది మరిన్ని బలమైన అడుగులు వేసే విధంగా పురిగొల్పుతుంది. ఇప్పుడు ఇదే ఆత్మవిశ్వాసాన్ని కావ్య మారన్ అలియాస్ కావ్య పాప కొనసాగించేందుకు అడుగులు వేస్తోంది.
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సౌత్ ఆఫ్రికా t20 లీగ్ ఆదివారంతో ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్ పై సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ విజయం సాధించింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టుకు యజమానిగా కావ్య మారన్ వ్యవహరిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ప్రిటోరియా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ జట్టులో బ్రేవిస్(101) సెంచరీ చేశాడు. 56 బంతులు ఎదుర్కొన్న అతడు.. 8 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. పార్సన్స్(30) మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ప్రిటోరియా జట్టు భారీగా పరుగులు చేయలేకపోయింది. మార్కో యాన్సన్ మూడు వికెట్లు పడగొట్టాడు. నోర్ట్జీ, సింపాలా చెరో వికెట్ సాధించారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన సన్ రైజర్స్ జట్టు.. ఆశించిన స్థాయిలో ఆరంభాన్ని అందుకోలేకపోయింది. క్వింటన్ డికాక్(18) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో(0) సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ దశలో సన్ రైజర్స్ జట్టు భారాన్ని బ్రిట్జ్ కీ మోసాడు. 49 బంతులలో 68 పరుగులు చేశాడు అతడు. హర్మాన్(3), కోలిస్(1) విఫలమయ్యారు. ఈ క్రమంలో స్టబ్స్(63) అదరగొట్టడంతో సన్ రైజర్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
ఈ ట్రోఫీ ద్వారా సన్ రైజర్స్ మూడో టైటిల్ సొంతం చేసుకుంది. 2022, 23 సీజన్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ ప్రిటోరియా జట్టును ఓడించి ట్రోఫీ అందుకుంది.
2023, 24 సీజన్లో డర్బన్ జట్టును ఓడించి సన్ రైజర్స్ జట్టు ట్రోఫీ అందుకుంది.
2024, 25 సీజన్లో ముంబై కేప్ టౌన్ జట్టు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టును ఓడించి తొలిసారిగా విజేతగా నిలిచింది.
2025, 26 సీజన్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు ప్రిటోరియా జట్టును ఓడించి ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది.