Mudragada Padmanabham: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. ఇటువంటి సమయంలో టిడిపి, వైసీపీలో కొనసాగుతున్న ఇద్దరు నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీలో ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను.. టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు చినరాజప్ప. కానీ మంత్రి పదవి దక్కలేదు. అటువంటి నేత వైసీపీలో యాక్టివ్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం కలుసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది.
చంద్రబాబుతో విభేదించి..
గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ). కానీ చంద్రబాబును విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. తరువాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు కనుక.. అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఉద్యమ బాట పట్టారు. అయితే ఆ ఉద్యమం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూర్చింది. టిడిపికి నష్టం చేసింది. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఉద్యమాన్ని నిలిపివేశారు ముద్రగడ. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిడిపి కూటమిని ఓడిస్తానని.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలవనివ్వబోనని శపధం చేశారు. అయితే టిడిపి కూటమి ఘన విజయం సాధించే సరికి తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ మధ్యన అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇటువంటి తరుణంలో ముద్రగడ పద్మనాభంను నిమ్మకాయల చినరాజప్ప కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం..
అయితే ముద్రగడతో పాటు నిమ్మకాయల చినరాజప్ప కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు. గత ఏడాది ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ముద్రగడను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారట చినరాజప్ప. అప్పట్లో వైద్యులు సూచన మేరకు కలవలేదు. అందుకే ఇప్పుడు కలిసినట్లు తెలుస్తోంది. ఇది కేవలం మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా జరిపిన భేటీ అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే గోదావరి జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేత బాధ్యతలు ముద్రగడ పద్మనాభం అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు తాను విశ్రమించని ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలో టిడిపికి చెందిన సీనియర్ నేత ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తమ మధ్య మర్యాదపూర్వక భేటీ మాత్రమే జరిగిందని.. దీనికి ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని ఇద్దరు నేతలు తేల్చి చెప్పడం విశేషం.