మాజీ మంత్రి , కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలం నుండి శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఆయన్ని , కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రి లో చేర్పించారు. గత కొంతకాలం నుండి చికిత్స తీసుకుంటున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత రాజకీయ వర్గాల్లో తీవ్రమైన దిగ్బ్రాంతి వాతావరణం నెలకొన్నది. ముద్రగడ పద్మనాభం 1953 వ సంవత్సరం లో కిర్లంపూడి లో జన్మించారు. కాపు సామాజిక వర్గం కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన ఆయన, 1978 వ సంవత్సరం లో తొలిసారిగా జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీవీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1989 వ సంవత్సరం వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఎన్టీఆర్ , మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.
అంతే కాదు 2024 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం క్రియాశీలక రాజకీయాల్లో ఏ విధమైన పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. ముందుగా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో చేరాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తనకు తగిన గౌరవం ఇవ్వలేదని , తన ఇంటికి వస్తానని మాటిచ్చి ఇప్పటి వరకు రాలేదని, తనకు గౌరవం ఇవ్వని వాళ్ళతో నేను కలిసి నడిచేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన వైసీపీ పార్టీ లో చేరారు. పవన్ కళ్యాణ్ ని కచ్చితంగా పిఠాపురం లో ఓడించి తీరుతాను , ఒకవేళ అలా చేయకపోతే , నా పేరు మార్చుకుంటాను అంటూ మీడియా ముందు సవాలు చేశారు. చెప్పినట్టుగానే ఆయన పవన్ కళ్యాణ్ ని ఓడించలేకపోవడం తో తన పేరు ని ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’ గా మార్చుకున్నారు.ఆయన వైసీపీ పార్టీ లో ఉన్నప్పటికీ, ఆయన కుమార్తె , అల్లుడు 2024 ఎన్నికల సమయం లోనే జనసేన పార్టీ లో చేరారు. కొన్నాళ్ల నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన , అకస్మాత్తుగా ఇలా మరణించారు అనే వార్త రావడం తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.
కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఎన్నో పోరాటాలు చేశారు. దాని వల్ల ఈయనకు ఆ సామాజిక వర్గం లో ఎంతో మంచి పేరు వచ్చింది. ఆయన మాటలకు ముఖ్యమంత్రులు సైతం విలువ ఇస్తుంటారు. అలాంటి స్థాయిని సంపాదించుకున్న ముద్రగడ నేడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
