AP Elections 2024: ఏపీలో ఎన్నికల హై టెన్షన్ వాతావరణం ప్రారంభం కానుంది. నేటి నుంచి పార్టీల అధినేతలు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. వైసీపీ అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటివరకు అడపాదడపా కార్యక్రమాలకు పరిమితమయ్యారు. ఈసారి మాత్రం పోలింగ్ వరకు జనాల్లోనే ఉండనున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి సంబంధించి నాలుగో విడత మే 13న పోలింగ్ జరగనుంది. అంటే మే 11 వరకు ప్రచార హోరు సాగనుందన్నమాట.
రెండోసారి విజయం సాధించాలని జగన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. సంక్షేమమనే తారక మంత్రంతో ముందుకు సాగుతున్నారు. సంక్షేమ పథకాలను 99% అమలు చేశానని.. మరోసారి తనను దీవించాలని ప్రజల ముంగిటకు వెళ్తున్నారు. ఇప్పటికే సిద్ధం పేరిట రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దాదాపు 175 నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఈరోజు ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనల అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కడప పార్లమెంటు నియోజకవర్గం లో జగన్ పర్యటన కొనసాగనుంది. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్ర పూర్తి చేయాలన్నది లక్ష్యం.
అవినీతి కేసుల్లో చంద్రబాబు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అంతకుముందే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలను చంద్రబాబు నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలపై వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగారు. జైలు నుంచి బయటకు వచ్చాక సైతం దూకుడు పెంచారు. ఇప్పుడు నేరుగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఈరోజు నుంచి ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచార సభల నిర్వహిస్తారు. రోడ్ షోలు, ప్రజా దర్బార్లు నిర్వహించనున్నారు. ఈరోజు ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో భాగంగా పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్, నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఈనెల 30 నుంచి ప్రచారానికి ముహూర్తంగా నిర్ణయించారు. తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి సమర శంఖం పూరించనున్నారు. జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాలల్లో ప్రచారం చేయనున్నారు. కూటమి అభ్యర్థుల తరఫున సైతం ప్రచారాన్ని చేపట్టనున్నారు. మిగతా భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. అయితే ఇకనుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి తన కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ముగ్గురు అధినేతలు ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగడంతో ఏపీలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది.