India vs South Africa : కటక్ మైదానంలో భారత జట్టుకు అంత గొప్ప రికార్డు లేదు.. ఎందుకంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన రెండు టి20 మ్యాచ్లో కూడా టీమిండియా ఓటమిపాలైంది. పైగా ఇక్కడి పిచ్ కూడా బ్యాటర్లకు అంతగా సహకరించదు. టాస్ గెలిచిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. మంగళవారం నాటి టీమిండియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా పైవేచోటు చేసుకున్నాయి.
టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. ఎంగిడి వేసిన తొలి ఓవర్ మూడో బంతికే గిల్ ఔట్ అయ్యాడు. అతడు కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. ప్రమాదకరమైన అభిషేక్ శర్మ (17), సూర్య కుమార్ యాదవ్ (12) విఫలం కావడం.. తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్(23) వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించడంతో టీమిండియా ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చాడో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది.
వచ్చి రాగానే తన ఉద్దేశం ఏమిటో సౌతాఫ్రికా బౌలర్లకు రుచి చూపించాడు హార్దిక్ పాండ్యా. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా..ఆ తర్వాత కటక్ మైదానాన్ని హోరెత్తించాడు. 28 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 59 పరుగులు చేశాడు. అంతేకాదు చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా దూకుడు వల్ల టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో ఇంగిడి 3 వికెట్లు సాధించాడు. సిపామ్లా రెండు వికెట్లు దక్కించుకున్నాడు..
వాస్తవానికి టీమిండియా ఒకానొక దశలో 11.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఈ దశలో వచ్చిన హార్దిక్ పాండ్యా టీమిండియా స్కోర్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాడు.. తోటి ప్లేయర్లు అవుట్ అవుతున్నప్పటికీ.. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతని వేగవంతమైన బ్యాటింగ్ వల్ల టీం ఇండియా ఆ స్కోర్ చేయగలిగింది. వాస్తవానికి హార్దిక్ పాండ్యా పవర్ హిటింగ్ తో పాటు.. అత్యంత ఇంటిలిజెన్స్ కూడా ప్రదర్శించాడు. అందువల్లే టీమిండియా ఈ స్థాయిలో స్కోర్ చేసింది. ముఖ్యంగా నోకియా బౌలింగ్లో అప్పర్ కట్ షాట్ ఆడి సిక్సర్ కొట్టడం ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్. ఈ మ్యాచ్లో నాలుగు సిక్సర్లు కొట్టడం ద్వారా హార్దిక్ పాండ్యా టి20 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో చేరాడు.