Hyderabad crime : ఇది మామూలు మ*ర్డ*ర్ కాదు.. దృశ్యం సినిమాను మించిపోయింది. ప్రతి సీన్ లోనూ ఉత్కంఠ.. ప్రతి కదలికలోనూ సీక్రసీ కొనసాగించింది. కాకపోతే చివరి క్షణంలో దొరికిపోయింది. ఫలితంగా ఆమె.. ఆమె ప్రియుడు.. ఈ దారుణానికి సహకరించిన మరొక వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నారు.
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి హ*త్య కేసును పోలీసులు చేదించారు. ఏడు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన పోలీసులకు ఒక సవాల్గా నిలిచింది. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో.. ఒక సందర్భంలో పోలీసులు ఈ కేసును మూసివేద్దాం అనుకున్నారు. చివరికి ఒక కీలకమైన ఆధారం లభించడంతో.. కేసులో పురోగతి లభించింది. అంతేకాదు.. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన మృతుడి భార్యను.. ఆమె ప్రియుడిని.. ఈ హత్యకు సహకరించినక మరొక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మియాపూర్ ప్రాంతంలో అంబేద్కర్ నగర్లో పెంటేష్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇతడికి గతంలోనే వివాహం జరిగింది. మొదటి భార్య చనిపోవడంతో.. ఆ ప్రాంతంలో పనులు చేసుకునే సత్యవతి అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. సత్యవతి అదే అపార్ట్మెంట్లో అద్దెకు ఉండే మర్రి మధుసూదన్ రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయం పెంటేష్ కు తెలిసింది. భార్యను నిలదీశాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న పెంటేష్ ను అడ్డు తొలగించుకోవాలని సత్యవతి అనుకుంది. మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రణాళిక రూపొందించింది.
ఈ ప్రణాళికలో భాగంగా వారు దృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారు. అందులో సన్నివేశాల ఆధారంగా పెంటేష్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా పెంటేష్ కు ఆహారంలో మత్తుమాత్రలు వేసి హత్య చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని సత్యవతి.. మధుసూదన్ రెడ్డి.. అతడి స్నేహితుడు రాజేష్ కుమార్ కలిసి మహారాష్ట్ర తీసుకెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి దానం చేశారు. అనంతరం తిరిగి వచ్చారు. గత ఏడాది నవంబర్ 25న సత్యవతి తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ప్రవర్తనలో పోలీసులు మార్పులను గుర్తించారు. అంతేకాదు, పెంటేష్ కుటుంబ సభ్యులను సంప్రదించారు. వారు కొన్ని వివరాలు చెప్పారు. వాటిని నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో కేసును విచారించారు. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా మధుసూదన్.. సత్యవతి.. రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.
