Flight Charges: విమాన ప్రయాణం ఇక ప్రియం.. హైదరాబాద్‌ నుంచి చార్జీల పెంపు..

సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి టికెట్‌ ధర రూ.4,500 ఉంటుంది. ఎన్నికల ముందు రోజు (మే 12న) దీని ధర 50 శాతం పెరిగి రూ.6,500లకు చేరింది.

Written By: Raj Shekar, Updated On : May 11, 2024 11:07 am

Flight Charges

Follow us on

Flight Charges: సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14 వరకు డిమాండ్‌ ఎక్కవగా ఉంది. దీనికి అనుగుణంగా విమాన చార్జీలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కేరళ, గోవా, కొచ్చి వెళ్లే విమాన సర్వీస్‌ల టికెట్‌ ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి.

ప్రయాణికులు రద్దీతో…
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాధారణంగా రోజుకు 50 వేల మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య 60 వేలకు పెరిగింది. వేసవి సెలవులు, కొద్ది రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో కొడైకెనాల్, కొచ్చి, ఊటీ, కేరళ, జైపూర్, ఢిల్లీ, అయోధ్య, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, మలేషియా తదితర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. మరోవైపు ఎన్నికల దృష్ట్యా ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు నేతల రాకపోకలు పెరిగాయి. ఫలితంగా పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చార్జీలు పెంచాయి.

పెంపు ఇలా..
సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి టికెట్‌ ధర రూ.4,500 ఉంటుంది. ఎన్నికల ముందు రోజు (మే 12న) దీని ధర 50 శాతం పెరిగి రూ.6,500లకు చేరింది. అదే రోజు ఢిల్లీకి రూ.6 వేలుగా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి కొచ్చి టికెట్‌ ధర రూ.5 వేలు ఉంటుంది. ఈనెల 12న ఈ ధర రూ.7 వేలకు పెంచాయి. రద్దీని బట్టి చార్జీల్లో మార్పులు ఉంటాయని ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.

రాయితీ ఆశలు ఆవిరి..
ఓటింగ్‌ పెంచేందుకు ఎన్నికల సంఘం ఇటీవల వివిధ ఎయిర్‌లైన్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. యువతను ప్రోత్సహించేందుకు టికెట్‌ చార్జీలపై రాయితీ ఇవ్వడానికి పలు విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే తాజాగా చార్జీలు పెంచడంతో రాయితీ ఇచ్చి ఏం లాభం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు రావాలనుకుంటున్నవారు నిరాశ చెందుతున్నారు.