
టీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరికకు ముహూర్తాన్ని సిద్ధం చేసుకున్నారు. మంచిరోజున ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కుటుంబసభ్యులతో చర్చించిన ఆయన ఈ నెల 13,14 తేదీల్నీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ద్వారా జాతీయ నాయకత్వానికి ప్రతిపాదించారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, మరికొందరు బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే పదవికి ఈటల మంగళ లేదా బుధవారం రాజీనామా చేసే అవకాశం ఉంది. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, అందుబాటులో ఉంటే అసెంబ్లీ స్పీకర్ కు లేదా ఆయన కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని ఈటల భావిస్తున్నట్లు తెలిసింది.