Dharmapuri : మనదేశంలో రాముడు నుంచి కృష్ణుడి వరకు.. శివుడి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. విశేషమైన ఐతిహ్యం ఉంది. కానీ మీరు ఎప్పుడైనా యమధర్మరాజుకు ఆలయం ఉండడం ఎప్పుడైనా చూశారా.. ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి.. నిత్య పూజలు చేయడం ఎప్పుడైనా విన్నారా.. అయితే ఈ కథనం మీకోసమే.. ఇంతకీ యమధర్మరాజు ఆలయం ఎక్కడ ఉంది? ఆయనకు పూజలు ఎలా చేస్తారు? వంటి ఆసక్తికరమైన సంగతులపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజుకు కోవెల కూడా ఉంది. ఈ విగ్రహం దేశంలోనే అత్యంత పురాతనమైనదని ఇక్కడి పురోహితులు చెబుతుంటారు. ఈ ఆలయంలో భక్తులు యమధర్మరాజును ముందుగా దర్శించుకుంటారు. ఆ తర్వాతే లక్ష్మి నృసింహస్వామి, వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తుంటారు. పురాణాల ప్రకారం యమధర్మరాజుది భరణి జన్మనక్షత్రం. ఈ సందర్భంగా ప్రతి నెల ఆలయ పరిసర ప్రాంతంలో ఆయుష్షు హోమం, మంత్రపుష్పం వంటి పూజలు చేస్తారు. ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా యమ ద్వితీయ వేడుకలు జరుపుతారు.. యమ ద్వితీయ రోజు సందర్భంగా నరక ద్వారాలను మూసేస్తారట. ఆరోజున యమధర్మరాజు తన సోదరి యమి ఇంటికి వెళ్తారట. ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తారట. అయితే ఆరోజు చనిపోయిన వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందట.. దేశం మొత్తంలో అరుదైన ఈ యమధర్మరాజు విగ్రహం ఇక్కడే ఉండడం.. ఆయనకు గుడి కూడా ఉండడంతో.. దేశవ్యాప్తంగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. యమధర్మరాజుకు పూజలు చేస్తూ ఉంటారు. పక్కనే ఉన్న గోదావరిలో స్నానం చేసి.. యమధర్మరాజును దర్శించుకుంటారు.
చారిత్రక నేపథ్యం ఇదీ
పూర్వకాలంలో యమధర్మరాజు తను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్యక్షేత్రాల బాటపడతాడు. ఇందులో భాగంగా ధర్మపురి చేరుకుంటాడు. ఇక్కడ లక్ష్మి నృసింహస్వామిని దర్శించుకుంటాడు. దానికంటే ముందు గోదావరిలో స్నానం చేస్తాడు. స్వామివారి శరణు వేడుకుంటాడు. యమధర్మరాజు పూజలకు మెచ్చి లక్ష్మి నృసింహస్వామి అతని పాప విముక్తుడిని చేస్తాడు. దీంతో నృసింహస్వామి కృపతో ఆలయంలోని దక్షిణభాగానికి యమధర్మరాజు వెళ్లిపోతాడు. తనను ముందుగా దర్శించుకున్న తర్వాత స్వామివారిని కొలిచే విధంగా వరం పొందుతాడు. అయితే ఇక్కడ యమధర్మరాజు గోదావరిలో స్నానం చేశాడు కాబట్టి ఆ ప్రాంతానికి యమ గుండాలు అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతుంటాయి. ఇక ధర్మపురి అనే ప్రాంతానికి ధర్మ వర్మ అనే రాజు పరిపాలించడం వల్ల ఆ పేరు వచ్చిందని పురాణాలు చెబుతుంటాయి. క్రీస్తు శకం 850 నుంచి 928 మధ్యకాలం ముందు నుంచే ఈ క్షేత్రం ప్రాశస్త్యంలో ఉంది. అయితే క్రీస్తుశకం 1422 నుంచి 1436 మధ్యకాలంలో బహమనీ సుల్తానులు ఈ ప్రాంతంపై కన్నువేశారు.. దానిని దక్కించుకోవడానికి దండయాత్ర చేశారు. ఫలితంగా ఈ క్షేత్రం నామరూపాలను కోల్పోయింది. అనంతరం 17వ శతాబ్దంలో నృసింహ ఈ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ తర్వాతే ఈ క్షేత్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందని వివరిస్తుంటారు.