CPI Narayana: దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయింది. ఎన్నికల్లో గెలిచేటంత బలం లేదు. కానీ ఎదుటి పార్టీల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో వారు ఉన్నారు. ప్రస్తుతం వామపక్షాలు అధికారంలో ఉన్నది కేవలం కేరళలో మాత్రమే. దేశంలో బిజెపి ఎంటర్ అయిన తర్వాత వామపక్షాలు నిర్వీర్యమయ్యాయి. కానీ ప్రజా సంఘాల రూపంలో వామపక్షాలు బలంగానే కనిపిస్తున్నాయి. వామపక్షాల నేతలకు సైతం సరైన గౌరవం ఉంటుంది. అయితే సమకాలీన అంశాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాటలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అతిగా స్పందిస్తారని సొంత పార్టీ నేతలే చెబుతుంటారు.
కమ్యూనిస్టులు అంటేనే భారతీయ జనతా పార్టీకి పడదు. ఆ రెండు పార్టీల మధ్య దశాబ్దాల వైరం నడుస్తోంది. కానీ దేశవ్యాప్తంగా బిజెపి విస్తరిస్తోంది. ఏపీలో సైతం తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఆ రెండు పార్టీలు వామపక్షాలకు స్నేహపూర్వక పక్షాలే. కానీ వామపక్షాల వైపు కాకుండా.. కేంద్రంలో ఉన్న బిజెపిని కలుపు కెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే మొన్నటి వరకు ఆ రెండు పార్టీలతో కలవాలన్న వామపక్షాల కోరిక నెరవేరలేదు. పైగా తన శత్రువుతో ఆ రెండు పార్టీలు జతకట్టడంతో ఏపీలో వామపక్షాలు కాంగ్రెస్తో వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు ఇది మింగుడు పడని విషయం.
అయితే సిపిఐ నారాయణ తన పార్టీ అభివృద్ధి కంటే బిజెపి పై విమర్శలకే అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే ఒక్కోసారి ఏం మాట్లాడతారో తెలియదు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రఘురామకృష్ణం రాజుకు బిజెపి మోసం చేసిందని.. నమ్మించి నట్టేట ముంచిందని ఆరోపించారు. అయితే ఇక్కడే నారాయణ లాజిక్ మిస్సయ్యారు. అసలు రఘురామకృష్ణంరాజు వైసిపి బహిష్కృత నాయకుడు. అసలు బిజెపిలో చేరలేదు. అలాగని టిడిపిలో చేరలేదు. కానీ ఎంపీ టికెట్ ఇవ్వకుండా కూటమి మోసం చేసిందని ఆరోపణలు చేయడం ఏమిటి? పైగా నారాయణ సిపిఐ ఇండియా కూటమిలో ఉంది. ఎన్డీఏ తరపున రఘురామకృష్ణం రాజుకు టిక్కెట్ ఇవ్వాలని నారాయణ ఎందుకు కోరుతారు? రాజకీయ విమర్శలు బలంగా ఉండాలి కానీ.. ఇలా చౌకబారు విమర్శలు చేయడం ఏమిటన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరహా విమర్శలు ఆయనకు ఇబ్బందికరంగా మారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.