
పంజాబ్ లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని శనివారం గవర్నర్ కు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనాా చేసినట్లు తెలుస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని ఒత్తిడి చేయడంతో అధిష్టానం రాజీనామా చేయాలని అమరీందర్ ను సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల సీరియస్ గా ఉన్న కెప్టెన్ అమరీందర్ తన సీఎం పదవికి గుడ్ బై చెప్పనున్నట్లు తెలిసిందే. ఇలాంటి అవమానాలతో పార్టీలో కొనసాగలేనని సోనియా గాంధీతో ఆయన చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించేందుకు పార్టీ సమాయత్తమైన వేళ కెప్టెన్ అమరీందర్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ముందు అమరీందర్ మీడియాతో మాట్లాడారు. మూడో సారి తనను అవమానించినట్లు ఆయన అన్నారు. రాజీనామా చేయాలని ఇవాళ ఉదయమే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ కు తన నిర్ణయాన్ని చెప్పినట్లు వెల్లడించారు.
అయితే తన భవిష్యత్ కార్యాచరణపై కొన్ని సంకేతాలు ఇచ్చారు. రాజకీయ భవిష్యత్ గురించి నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలు వినియోగిస్తా. నా వెంట ఉన్నవారితో మాట్లాడి భవిష్యత్ పై నిర్ణయం అని అమరీందర్ సింగ్ చెప్పారు. ఈ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్ లో వివాదం మరింత ముదిరింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూతో విభేదాలు తారస్థాయికి చేరాయి.