
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ( MAA elections) మొదలవ్వక ముందే రసవత్తరమైన పోటీ మొదలు అయిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తాజాగా ఎన్నికల తేదీతో పాటు నియమ నిబంధనలు, మరియు ఇతర విషయాలను అధికారికంగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఒక ప్రకటన వదిలారు.
ఆ ప్రకటనలో ముఖ్య అంశాలు విషయానికి వస్తే.. అక్టోబర్ 10న ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో జరగబోతున్నాయి. అలాగే అదే రోజు సాయంత్రం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు. ఇక మొత్తం ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ మరియు 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.
అన్నట్టు సెప్టెంబరు 27, 28, 29 తేదీల్లో నామినేషన్లు స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. నామినేషన్ దరఖాస్తుకు రూ.100, ఓటర్ల జాబితా కావాలంటే రూ.500 చెల్లించాలని తెలిపారు. ఆఫీస్ బేరర్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు రూ.15వేలు, ఈసీ మెంబర్ రూ.10వేలు డిపాజిట్(నాన్ రిఫండబుల్)చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే పోలింగ్ తేదీ రోజున ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డుతో రావాల్సిందేనని కృష్ణమోహన్ తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులతో పాటు సీవీఎల్ నర్సింహరావు కూడా పోటీపడుతున్నాడు. ప్రకాశ్‌రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. ప్రస్తుతం మంచు విష్ణు ప్యానెల్‌కు సంబంధించి బాబూమోహన్, రఘుబాబు పేర్లు వినిపిస్తున్నాయి.