BRS Internal Differences: రాజకీయాలలో ముఖ్యంగా కుటుంబాలు నడిపే పార్టీలలో అంతర్గతంగా కుమ్ములాటలు చోటు చేసుకోవడం మనదేశంలో కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ లో సంజయ్ గాంధీ వ్యవహార శైలి ఈ దేశ ప్రజలకు సుపరిచితమే. తమిళనాడులో డీఎంకే, ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.. అంతిమంగా అధికారం కోసం, అలవిమాలిన సంపాదన కోసం జరిగే పోరాటాలు ప్రాంతీయ కుటుంబ పార్టీల అసలు బాగోతాన్ని బయటపెడతాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి భారత రాష్ట్ర సమితి కూడా చేరింది.
2014లో అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి.. తెలంగాణలో వ్యవస్థలను ఎంత నాశనం చేయాలో అంత చేసింది. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనేసింది. ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకుంది. కాలేశ్వరం నుంచి మొదలు పెడితే గొర్రెల పంపిణీ వరకు ఇలా ప్రతి పథకంలోనూ అవినీతి జరిగిందని, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపించాయి. వాస్తవానికి ఇటువంటి కుంభకోణాలు పార్టీకి డ్యామేజ్ చేయడం ఒక ఎత్తు అయితే.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కలిగించే డ్యామేజ్ మరొక ఎత్తు.
వాస్తవానికి గులాబీ పార్టీలో ఈ స్థాయిలో అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. సాక్షాత్తు కెసిఆర్ కుమార్తె వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తారని.. తన తండ్రి పరిపాలనను ఉదాహరణలతో వివరిస్తూ విమర్శిస్తారని ఎవరూ అంచనా వేయలేదు. కాలేశ్వరం ప్రయోజనం నెరవేరలేదని, పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పండబెట్టారని, సామాజిక తెలంగాణ సహకారం కాలేదని ఇలా ప్రతి విషయంలోనూ కవిత విమర్శలు చేసుకుంటూ పోయారు. కొన్ని సందర్భాలలో లెక్కలతో సహా వివరించారు. ఒక రకంగా ఈ పనిని కాంగ్రెస్ చేయాల్సి ఉండేది. ఒక రకంగా బలమైన స్వరాన్ని వినిపించే ప్రయత్నం చేశారు కవిత.
కవిత చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదు. కానీ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఏం చేశారు అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. భారత రాష్ట్ర సమితి ఏర్పాటును వ్యతిరేకించానని చెప్పిన ఆమె.. పార్టీ ప్రారంభత్సవానికి ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో విధ్వంసం జరిగిందని చెబుతున్న ఆమె.. గతంలో బంగారు తెలంగాణ సాకారం అయిందని ఎందుకు చెబుతున్నట్టు.. లిక్కర్ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయారు కాబట్టి.. కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఆమె కెసిఆర్ కు వ్యతిరేకంగా వ్యవహరించాలి కాబట్టి.. అలానే చేస్తున్నారని గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి రాజకీయాల లక్ష్యాలకు అనుగుణంగా ఆమె నడుచుకుంటున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు.
వాస్తవానికి తన పార్టీలో ఉన్నప్పుడు ప్రాధాన్యం దక్కలేదని పదేపదే ఆరోపిస్తున్న కవిత.. ఒకసారి ఎంపీ ఎలా అయ్యారు? మరోసారి ఎమ్మెల్సీ ఎలా అయ్యారు? సింగరేణిలో అధ్యక్షురాలిగా ఎలా ఉన్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని గులాబి పార్టీ నేతలు అంటున్నారు. అధికారం దూరంగానే కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదని ఆమెకు గుర్తుచేస్తున్నారు. మరోవైపు జాగృతి నేతలు స్పందిస్తున్న తీరు వేరే విధంగా ఉంది. కేటీఆర్ కూడా ఆమెకు ద్రోహం చేశారని.. కనీసం ఒక పని కూడా చేసుకునే అవకాశం కల్పించలేదని.. ఆమె భర్త ఫోన్ కూడా టాప్ చేశారని.. అలాంటప్పుడు ఆమె పార్టీలో ఎలా ఉంటారంటూ జాగృతి నేతలు చెబుతున్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో హరీష్ రావు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారని.. అందువల్లే కవిత ఆయన టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారని జాగృతి నేతలు చెబుతున్నారు.. కవిత రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక ఆమెకు అడుగడుగునా అడ్డు పుల్లలు వేస్తున్నారని.. అందువల్లే కవిత ఈ స్థాయిలో స్పందిస్తున్నారని జాగృతి నేతలు అంటున్నారు.
కవితకు, కెసిఆర్ కు మధ్యలో గ్యాప్ రావడానికి ప్రధాన కారణం హరీష్, సంతోష్ రావు అని జాగృతి నేతలు చెబుతున్నారు. అందువల్లే ఆమె ఆధారాలతో సహా విమర్శలు చేస్తున్నారని.. ఇందులో వ్యక్తిగత లక్ష్యాలు అంటూ ఏమీ లేవని జాగృతి నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అంతపురంలో జరిగే కుమ్ములాటలు రాజ్యానికి అసలు మంచివి కావు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఆ పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చాయి. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలలో అధికార పార్టీకి సానుకూలమైన ఫలితాలు వచ్చాయి. స్థానిక ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు కూడా గులాబీ పార్టీకి రాలేదు. అలాంటప్పుడు ఈ అంతర్గత కుమ్ములాటను ఏ స్థాయిలో కేసీఆర్ పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.