Bird Flu Alert
Bird flu : సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.. పైగా మటన్, చేపల కంటే చాలామంది చికెన్ తినడానికే ఆసక్తి చూపిస్తుంటారు. రేటు తక్కువగా ఉండడం.. త్వరగా జీర్ణం కావడం వల్లే వారు చికెన్ వైపు మొగ్గు చూపిస్తుంటారు.. అయితే బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చాలామంది బ్రాయిలర్ చికెన్ తినడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే ఈ 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య చికెన్ ఉడికించుకుని తింటే పెద్దగా ఇబ్బంది ఉండదని వైద్యులు సూచిస్తున్నప్పటికీ చాలామంది చికెన్ తినడానికి ముందుకు రావడం లేదు. దీంతో మటన్, చేపలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలలో కిలో చేపలు 150 నుంచి 250 వరకు పలికాయి. ఇందులో కొర్రమీను దాదాపు 400 దాకా పలికింది. ఇక రొయ్యలు కూడా కిలో 350 నుంచి 400 వరకు పలికాయి.. మటన్ ధర మాత్రం అమాంతం పెరిగింది. గతంలో ఎనిమిది వందలకు కిలో చొప్పున ఇచ్చే మటన్.. ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలకు చేరింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో.. పలు మార్కెట్లలో ఆదివారం కిలో మటన్ ను వ్యాపారులు 1000 వరకు విక్రయించారు.
చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే
చికెన్ విక్రయాలు అంతగా లేకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలోని మార్కెట్లలో ధరలలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. గడిచిన ఆదివారం కిలో చికెన్ ధర 220 నుంచి 240 వరకు పలికింది.. ఇప్పుడు కిలో చికెన్ రెండు వందల నుంచి 220 వరకు లభ్యమవుతోంది. హైదరాబాదు, విశాఖపట్నం లో స్కిన్ లెస్ కేజీ 200 వరకు పలకగా.. విజయవాడలో 220.. చిత్తూరులో 160.. వరంగల్లో 180 వరకు ధర పలికింది. చికెన్ ను 70 నుంచి 100° ల ఉష్ణోగ్రత మధ్య ఉడికించి తింటే పెద్దగా ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయితే బర్డ్ ప్లూ అనేది ప్రాణాంతక వైరస్ కాదని.. పక్షుల్లో మాత్రమే అది వ్యాపిస్తుందని.. అది సోకిన కోళ్లను కాకుండా.. ఆరోగ్యవంతమైన కోళ్లను ఆహారంగా తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నారు. ” రోగనిరోధక శక్తి కోసం కచ్చితంగా మనుషులకు ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అనేది మాంసంలో విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు అప్పుడప్పుడు మాంసాన్ని ఆహారంగా తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది. తద్వారా శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుందని” వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న మాంసాన్ని తీసుకోవాలని.. అది కూడా మితంగా ఉండాలని వైద్యులు వివరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కూడా కొద్దిరోజుల వరకు చికెన్ తినకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చికెన్ విక్రయాలు పడిపోయాయి. అయినప్పటికీ ధరలు తగ్గకపోవడం గమనార్హం.