Nara Lokesh: విపక్ష నేతలను ఓడించాలని జగన్ గట్టి ప్రయత్నంతో ఉన్నారు.చంద్రబాబు, పవన్, లోకేష్ ల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వారిని ఎలాగైనా ఓడించాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు. అయితే కీలక నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విపక్షాల ఆరోపిస్తున్నాయి. వందల కోట్లు కుమ్మరిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచే జగన్ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారని.. అడ్డదారుల్లో విపక్ష నేతలను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు అనుకూల అధికారులను కీలక నియోజకవర్గాల్లో నియమించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ముఖ్యంగా లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గంలో అధికారుల నియామకం విమర్శలకు దారితీస్తోంది. సాక్షాత్ కలెక్టర్ ఓ అధికారి నియామకం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థకు కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిర్మల్ కుమార్ ఈ జిల్లాకు చెందిన వాడే. దీంతో ఆయనను బదిలీ చేయాలని గతంలోనే కలెక్టర్ ఉన్నతాధికారులను కోరారు. కానీ అటువంటి చర్యలేవీ లేకుండా పోయాయి. ఇప్పుడు మరోసారి కలెక్టర్ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన్ను ప్రత్యేకంగా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ ను ఓడించేందుకు కుట్ర జరుగుతోందని టిడిపి అనుమానిస్తోంది.
వాస్తవానికి ఎన్నికల సమయంలో అధికారుల బదిలీ తప్పకుండా చేయాలి. కమిషనర్ లాంటి ఉన్నత స్థాయి అధికారి అయితే ఎట్టి పరిస్థితుల్లో సొంత జిల్లాల్లో ఉంచకూడదు. కానీ నిర్మల్ కుమార్ విషయంలో అలా జరగలేదు. అయితే ఈ విషయంపై గుంటూరు జిల్లా కలెక్టర్ గతంలోనే మున్సిపల్ పరిపాలన శాఖకు లేఖ రాశారు. అయినా నిర్మల్ కుమార్ ను బదిలీ చేయలేదు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరోసారి నిర్మల్ కుమార్ స్థానికుడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ మరోసారి లేఖ రాశారు. దీంతో ఈ విషయం బయటపడింది.
అయితే నిర్మల్ కుమార్ విషయంలో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు చూస్తే నివ్వెర పోతారు. నిర్మల్ కుమార్ అక్కడే కొనసాగుతారని.. ఆయన స్థానంలో ఎన్నికల విధులకు కార్పొరేషన్ ఆడిట్ శాఖ ఉపసంచాలకుడుగా ఉన్న ఎగ్జామినర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్మల్ కుమార్ ప్రమేయం ఉండదని స్పష్టం చేయడం విశేషం. ఆయన ఎన్నికల్లో నేరుగా కీలక బాధ్యతలు నిర్వర్తించకపోయినా.. పరోక్షంగా సిబ్బందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అధికార పార్టీకి సహకారం అందించాలన్న దురుద్దేశంతోనే కమిషనర్ ను బదిలీ చేయకుండా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తుండడంతో.. ఉద్దేశపూర్వకంగానే కమిషనర్ ను బదిలీపై పంపకుండా అడ్డుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి నిర్మల్ కుమార్ మున్సిపల్ శాఖకు చెందినవారు కాదు. ఆయన కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లో పనిచేస్తూ… మంగళగిరి కమిషనర్ గా నియమితులయ్యారు. కానీ ఎన్నికల ముంగిట బదిలీ చేయాలన్న నిబంధన ఉన్నా.. సంబంధిత శాఖ అధికారులు విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.