Ram Charan: “రేపు విడుదల చేస్తాం, మాపు విడుదల చేస్తాం, భారీ హంగులతో నిర్మించాం..” అంటూ నానా హడావిడి చేసిన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్.. ఎట్టకేలకు గేమ్ చేంజర్ సినిమా నుంచి “జరగండి” అనే పాటను విడుదల చేసింది. వాస్తవానికి దసరా పండుగప్పుడే ఈ పాటను విడుదల చేస్తామని సోషల్ మీడియాలో డిజిటల్ పోస్టర్ ను ఈ సినిమా మేకర్స్ పోస్ట్ చేశారు. ఏమైందో తెలియదు కానీ ఆ పాట ఇన్ని నెలలపాటు వాయిదా పడుతూ చివరికి మార్చి 27న విడుదలైంది. వివిధ వేదికల వద్ద ఈ ప్రశ్నను దిల్ రాజును అడిగితే సమాధానం దాటవేస్తూ వచ్చారు. పాటలో క్వాలిటీ కోసమే ఇన్ని రోజులు పడుతోందని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తీరా పాట విడుదలైన తర్వాత.. అభిమానులు పెదవి విరుస్తున్నారు.
జరగండి అనే పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. తమన్ స్వరపరిచారు. దలేర్ మహేంది, సునిధి చౌహన్ పాడారు. ఈ పాట విడుదలకు ముందు సినిమా మేకర్స్ ఎంతో హైప్ క్రియేట్ చేశారు. పాటను చాలా గ్రాండియర్ గా తీశామని చెప్పారు. కోట్లల్లో డబ్బులు ఖర్చు పెట్టామని ఘనంగా చెప్పారు. తీరా విడుదల తర్వాత పాట వింటే.. క్యాచీ ట్యూన్ లాగా అనిపించడం లేదు. పైగా దలేర్ మహేంది అంత ఈజ్ తో పాడినట్టు కనిపించడం లేదు. పాటలో కొంతలో కొంత రిలీఫ్ ఏంటంటే సునిధి చౌహన్ వాయిస్ మాత్రమే. పైగా ఈ పాట ప్రారంభ ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ కోరస్.. శక్తి సినిమాలోని సుర్రో సుర్ర పాట లాగానే వినిపిస్తున్నాయి. శక్తి సినిమాలో ఈ పాటను మణిశర్మ స్వరపరిచారు. గొప్పగా తీశామని చెబుతున్న ఈ మూవీ మేకర్స్.. ట్యూన్ విన్నారా? లేదా? అనే సందేహాలను రామ్ చరణ్ అభిమానులు వెలిబుచ్చుతున్నారు.
ట్యూన్లను కాపీ చేస్తాడు అనే ఆరోపణలు ఉన్న తమన్.. ఈ పాటను కూడా శక్తి సినిమా నుంచి కాపీ చేయడం పట్ల రామ్ చరణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పాటను ఇలా చిత్రీకరించడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అంత బడ్జెట్ పెడితే సినిమా పాటలో క్వాలిటీ ఉండాలి కదా, ఆ క్వాలిటీ లేకుండా కాపీ కొడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టి.. ఇలాంటి కిచిడి పాట విడుదల చేస్తే.. మా మనోభావాలు ఏం కావాలంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పాటపై రామ్ చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.