Bandi Sanjay: ‘బండి’ ఏదీ ఊరికే మాట్లాడరు.. నాటి ‘ముద్దు’ వ్యాఖ్యలు నేడు వైరల్‌!

బండి సంజయ్‌ వ్యాఖ్యలు నాడు వైరల్‌ అయ్యాయి. దీంతో బండి సంజయ్‌ కార్యాలయం ఆ వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చింది. తెలంగాణ మాండలికంలో ఇది సాధారణంగా వినియోగించే పదమని తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : March 26, 2024 6:30 pm

Bandi Sanjay

Follow us on

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌.. 2023, మార్చి 11న చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. బీఆర్‌ఎస్‌ నాయకులు సంజయ్‌ వ్యాఖ్యలను ఖండించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బండి సంజయ్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కొందరు బీజేపీ నాయకులు స్పందించారు. సంజయ్‌ వ్యాఖ‍్యలనే తప్పు పట్టారు. అవి ఆయన సొంత వ్యాఖ్యలని, బీజేపీతో సంబంధం లేదని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. దీంతో బీజేపీలో తొలిసారి భిన్నాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి.

సంజయ్‌ ఏమన్నాడు..
ఇక నాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్‌.. ఢిల్లీ మద్యం కుంభకోణం విషయమై మీడియాతో మాట్లాడారు. ‘కవిత వికెట్ పడిపోయింది. అతి త్వరలో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. తప్పు చేసిన కవిత, కేసీఆర్‌ తీహార్‌ జైలుకు వెళ్తారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కవితను అరెస్టు చేస్తారి అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా తప్పు చేసిన వారిని అరెస్టు చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

వివరణ ఇచ్చినా..
బండి సంజయ్‌ వ్యాఖ్యలు నాడు వైరల్‌ అయ్యాయి. దీంతో బండి సంజయ్‌ కార్యాలయం ఆ వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చింది. తెలంగాణ మాండలికంలో ఇది సాధారణంగా వినియోగించే పదమని తెలిపింది. ఎవరైనా నేరం చేస్తే, అభినందిస్తారా? లేదా శిక్షిస్తారా? అని ఆ వ్యాఖ్యల ఉద్దేశమని పేర్కొంది. అయినా రచ్చ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో కవిత కూడా స్పందించారు. ఢిల్లీ పాలకుల ముందు తెలంగాణ తల వంచదని, తెలంగాణ ఆడబిడ్డ కంటి నుంచి నీళ్లు రావని, నిప్పులు కురుస్తాయని హెచ్చరించారు.

సరిగ్గా ఏడాది తర్వాత..
కాలం గిర్రున తిరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు మరోమారు బండి సంజయ్‌ నాడు చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్‌ అవుతున్నాయి. ఈసారి సంజయ్‌కు మద్దతుగా కొంతమంది ఆ వ్యాఖ్యలను వైరల్‌ చేస్తున్నారు. నాడు సంజయ్‌ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు తప్పు పట్టారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని వైరల్‌ చేస్తూ.. ‘సంజయ్‌ ఏదీ ఊరికే మాట్లాడరని, దానివెనుక ఆంతర్యం ఉంటుందని.. అందుకు కవిత అరెస్టు.. తీహార్‌ జైలుకు తరలింపే ఉదాహరణ’ అని పేర్కొంటున్నారు.