Bhogapuram International Airport : ప్రజలకు ఇప్పుడు ఇట్టే అన్ని తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియా ( social media) విస్తృతం అయిన తరువాత తప్పేది? ఒప్పేది? తప్పుడు ప్రచారం ఏంటి? అనే దానిపై ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అలాగని ఏది పడితే అది ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితి కూడా లేదు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. రాజకీయాలకు అతీతంగా పథకాలను అందించగలిగింది. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ అదే సమయంలో అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు వంటి విషయంలో మాత్రం జగన్ సర్కార్ ప్రతికూలతలను ఎదుర్కొంది. ప్రజా గ్రహాన్ని సైతం చవిచూసింది. అయితే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి గత 18 నెలల్లో ఎంతో పురోగతి సాధించాయి. శరవేగంగా పనులు జరిగాయి. కచ్చితంగా అది కూటమి ప్రభుత్వం క్రెడిట్. కానీ దానిని దక్కించుకునేందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన శిబిరం ప్రయత్నిస్తుండడం మాత్రం కొంచెం ఇబ్బందికరమే.
* టిడిపి హయాంలో ప్రతిపాదన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని( bhogapuram International Airport ) ప్రతిపాదించింది 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం. అప్పట్లో భూసేకరణ కూడా ప్రారంభించింది. అయితే అప్పుడే జగన్మోహన్ రెడ్డి విశాఖలో విమానాశ్రయం ఉండగా.. మరో విమానాశ్రయం అవసరమా? ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుందాం? భూములు ఇవ్వకండి అంటూ రైతులను రెచ్చగొట్టారు. తమ వంతు ఈ విషయంలో కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మడత పేచి వేశారు. 2024 ఎన్నికలకు ముందు హడావిడిగా మరోసారి ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ విమానాశ్రయం పూర్తి చేసేందుకు కృషి చేసింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకొని.. 18 నెలల కాలంలో దాదాపు 75% పనులను పూర్తి చేయగలిగారు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి భూ సమీకరణ చేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి. కేవలం 26% పనులు మాత్రమే పూర్తయ్యాయి… కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 74% పనులు జరిగాయి. ప్రారంభోత్సవానికి ముంగిట విమానాశ్రయం నిలిచింది.
* అమరావతి, పోలవరం పైన అలానేనా?
అయితే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) నాడు వద్దన్న విమానాశ్రయం పూర్తయింది. కానీ దానిపై తామేదో కృషి చేసినట్లు అర్థం వచ్చేలా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. కానీ ఆ మరుక్షణం నుంచి భోగాపురం విమానాశ్రయం విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం ప్రారంభం అయ్యాయి. రేపు అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అలానే క్రెడిట్ వేసుకుంటారా? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఎందుకంటే అమరావతిని ప్రారంభించింది చంద్రబాబు. నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది చంద్రబాబు. జగన్ హయాంలో నత్తనడకన సాగాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టులు 2028 నాటికి ఒక కొలిక్కి వస్తాయి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాటి క్రెడిట్ ను తమ ఖాతాలో వేసేందుకు ఇలానే ప్రయత్నిస్తారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి.. ఇటువంటివి నమ్మే పరిస్థితి ఉండదు. అయితే పదే పదే ఇటువంటి ప్రకటనలు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పలుచన కాక తప్పదు.