New Job Opportunities: భారత దేశంలో ఏటా నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గిపోతున్నాయి. దీంతో ప్రైవేటు కంపెనీలే ఇప్పుడు యువతకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో ప్రభుత్వంలు విదేశీ కంపెనీలకు కూడా రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తున్నాయి. అనేక సంస్థలు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా వంటి నగరాలు ఉపాధి కేంద్రాలుగా మారాయి. తాజాగా లింక్డ్‌ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ 2025 నివేదిక ప్రకారం, భారతదేశంలో ఉద్యోగ మార్కెట్ ఒక పరివర్తన దశలో ఉంది. గతంలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పూణే వంటి మెట్రో నగరాలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండగా, ఇప్పుడు టైుర్–2, టైర్–3 నగరాలు ఉద్యోగ అవకాశాలు, ప్రతిభా ఆకర్షణలో కొత్త కేంద్రాలుగా ఉద్భవిస్తున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీ, కార్పొరేట్ కంపెనీల విస్తరణ వీటికి ప్రధాన కారణాలు. ఈ నివేదిక మార్చి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ పోస్టింగ్‌లు, ప్రతిభా స్థానాంతర ధోరణులను విశ్లేషించి, 10 లక్షల కంటే తక్కువ లింక్డ్‌ఇన్ సభ్యులున్న నగరాలను ఎంచుకుంది.
విశాఖపట్నం..
విశాఖపట్నం ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో, ఈ నగరం ఒక ప్రముఖ పారిశ్రామిక, ఉద్యోగ కేంద్రంగా మారింది. డాటా, ఫార్మాస్యూటికల్ కంపెనీలైన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, లారస్ ల్యాబ్స్ వంటివి ఈ నగరంలో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది టెక్ ఔత్సాహికులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది.
రాంచీ, విజయవాడ..
రాంచీ, జార్ఖండ్ రాజధాని, రెండవ స్థానంలో నిలిచింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, కొత్త హోటళ్లు, రిటైల్ విస్తరణ, మెరుగైన కనెక్టివిటీ ఈ నగరాన్ని ప్రొఫెషనల్స్‌కు ఆకర్షణీయంగా మార్చాయి. రిలయన్స్ రిటైల్, కాన్సెంట్రిక్స్, టాటా స్టీల్ వంటి కంపెనీలు ఇక్కడ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. అదే విధంగా, విజయవాడ మూడో స్థానంలో ఉంది. ఈ నగరం, సాంస్కృతిక వారసత్వంతోపాటు, మెట్రో రైలు, విమానాశ్రయ విస్తరణలతో ఐటీ కంపెనీలైన హెచ్‌సిఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్‌ల ఆకర్షణకు కేంద్రంగా మారింది.
నాసిక్, రాయ్‌పూర్..
నాసిక్, మహారాష్ట్రలోని వైన్ రాజధాని, నాల్గవ స్థానంలో ఉంది. ఐటీ, డాటా కంపెనీలతోపాటు ఆటోమొబైల్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ రంగాలలో వృద్ధి, రియల్ ఎస్టేట్ బూమ్‌తో ఈ నగరం ఉద్యోగ ఆకర్షణగా మారింది. డబ్ల్యూఎన్‌ఎస్, డాటామాటిక్స్ వంటి కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. రాయ్‌పూర్, ఐదో స్థానంలో నిలిచింది. ‘నయా రాయ్‌పూర్’ ప్రాజెక్ట్ ద్వారా సెమీకండక్టర్స్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. జిందాల్ స్టీల్ అండ్ పవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి సంస్థలు ఈ నగరంలో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి.
Also Read: స్టార్ట్ యాక్షన్.. త్వరలో జగన్ పాదయాత్ర!
రాజ్‌కోట్, అగ్రా, మధురై…
రాజ్‌కోట్ (ఆరో స్థానం) తన ఎంఎస్‌ఎంఈ–స్నేహపూర్వక వాతావరణం, రోడ్ కనెక్టివిటీ మెరుగుదలలతో ఆకర్షణీయంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. అగ్రా (ఏడో స్థానం) ‘న్యూ అగ్రా ప్రాజెక్ట్’ ద్వారా తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది, టొరెంట్ పవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి సంస్థలు దీనికి ఊతమిస్తున్నాయి. మధురై (ఎనిమిదో స్థానం) ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీ, వ్యవసాయ రంగాలలో పురోగతితో ఉద్యోగ కేంద్రంగా ఉద్భవిస్తోంది, హెచ్‌సీఎల్ టెక్, బుల్ ఐటీ సర్వీసెస్ వంటి కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.
వడోదర, జోధ్‌పూర్..
వడోదర (తొమ్మిదో స్థానం) బహుళ–కోట్ల పెట్టుబడులతో, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్, హౌసింగ్, రవాణా రంగాలలో వృద్ధి చెందుతోంది. అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ వంటి కంపెనీలు ఈ నగరంలో ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. జోధ్‌పూర్ (పదో స్థానం) స్టార్టప్‌లు, కొత్త కార్పొరేట్ కార్యాలయాల స్థాపనతో యువ ప్రొఫెషనల్స్‌కు ఆకర్షణీయంగా మారింది, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ వంటి సంస్థలు ఇక్కడ ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి.
ఈ నగరాల్లో బిజినెస్ డెవలప్‌మెంట్ రోల్స్ నాసిక్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, అగ్రా, వడోదర, జోధ్‌పూర్‌లలో ప్రధాన ఉద్యోగ డ్రైవర్‌గా ఉన్నాయి, అయితే విశాఖపట్నం, విజయవాడ, మధురైలలో ఇంజనీరింగ్ రంగం అగ్రస్థానంలో ఉంది. సేల్స్, ఆపరేషన్స్, ఎడ్యుకేషన్ రంగాలు కూడా ఈ నగరాల్లో ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ, స్మార్ట్ సిటీలు, మెరుగైన కనెక్టివిటీ, ఎంఎస్‌ఎంఈలకు మద్దతు ఇస్తూ ఈ నగరాల ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నాయి.