TS Gurukulam Jobs: తెలంగాణలో ఇటీవల ప్రకటించిన గురుకుల ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలిన పోస్టులను తర్వాతి మెరిట్ లిస్టులో ఉన్నవారితో భర్తీ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒకేసారి పోస్టుల ఫలితాలు ప్రకటించి అపాయింట్ మెంట్ ఆర్డర్లు జారీ చేయడంతో సుమారు 3 వేల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో 20 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ తర్వాత సుప్రీం కోర్టు గతంలో ముంజా ప్రవీణ్ కేసులో ఇచ్చిన తీర్పునే తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
మెరిట్ లిస్ట్‌లో ఉన్నవారికి ప్రయోజనం..
హైకోర్టు ఆదేశాలతో డౌన్‌వర్డ్ మెరిట్ లిస్టు ప్రకారం మిగిలిన ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈమేరకు కోర్టులో ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఆరోహణ క్రమంలో ఫలితాలు ప్రకటించి పోస్టులు భర్తీ చేయని కారణంగా పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై 20 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. సీనియర్ అడ్వకేట్ రఘు, ఇమాంజిని సంఘీ కోర్టులో వాదనలు వినిపించారు.
ఒక్కొక్కరికి మూడు నాలుగు ఉద్యోగాలు..
ఆరోహణ క్రమంలో భర్తీ చేస్తే మొదట డిగ్రీ లెక్చరర్ ఫలితాలు ప్రకటించాలి. తర్వాత జేఎల్, పీజీటీ, టీజీటీ ఫలితాలు ప్రకటించాలి. కానీ ప్రభుత్వం మొదట డీఎల్ ప్రకటించి తర్వాత పీజీటీ ఫలితాలు విడుదల చేసింది.తర్వాత జేఎల్, టీజీటీ ఫలితలు కూడా ప్రకటించింది. నాలుగు పోస్టులకు అభ్యర్థులకు అర్హతలు ఉండడం, చాలా మంది ఒకటికన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారు. ఫలితాల ప్రకటన తర్వాత చాలా మందికి ఒకటికన్నా ఎక్కువ పోస్టులు వచ్చాయి. అయితే వీరంతా ఒక పోస్టులో మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన పోస్టులను తర్వాత నోటిఫికేషన్‌లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జీవో 91, జీవో 564 జారీ చేసింది. ఇవి రీలిగ్విస్ట్‌మెంట్‌కు ఆటంకంగా మారాయి. దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించగా మెరిట్ లిస్టులో తర్వాత పొజిషన్‌లో ఉన్నవారితో ఖాళీలు భర్తీ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఎన్నికల తర్వాత ప్రక్రియ…
కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చేపట్టే అవకాశం ఉంది. ముందుగా పోస్టుల్లో జాయిన్ అయ్యేవారి నుంచి లేఖ తీసుకుని, తర్వాత మిగిలిన పోస్టులను లెక్కించి వాటి ఆధారంగా మెరిట్ లిస్టులో ఉన్నవారికి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. గురుకుల సొసైటీ తలచుకుంటే రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.