Donald Trump: ట్రంప్‌కు మంచి రోజులు.. తొలిసారి ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం..!

తాజా అంచనాల ప్రకారం ట్రంప్‌ ఆస్తుల నికర విలువ 4 బిలియన్‌ డాలర్లకుపైగా (రూ.33 వేల కోట్లు)పెరిగింది. దీంతో తొలిసారిగా ట్రంప్‌ బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో 6.5 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో చేరారు.

Written By: Raj Shekar, Updated On : March 27, 2024 8:45 am

Donald Trump

Follow us on

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మంచి రోజులు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇటీవలే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా మళ్లీ అధ్యక్ష రేసులో నిలిచేందుకు మార్గం సుగమమైంది. తాజాగా ఆయనకు మరో అదృష్టం కలిసి వచ్చింది. వ్యాపార సామ్రాజ్యంలో మునుపెన్నడూ లేని విధంగా లాభాలు వస్తున్నాయి. ట్రంప్‌ ఆదాయం పెరగడంతో ఆయన జీవితంలో మరుపురాని ఘట్టం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్‌ ఒకటి పూర్తవడంతో ట్రంప్‌ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దీంతో ప్రపంచంలో అత్యంత సంపన్నులైన తొలి 500 మంది జాబితాలో స్థానం దక్కింది.

ఆస్తుల విలువ ఇదీ..
తాజా అంచనాల ప్రకారం ట్రంప్‌ ఆస్తుల నికర విలువ 4 బిలియన్‌ డాలర్లకుపైగా (రూ.33 వేల కోట్లు)పెరిగింది. దీంతో తొలిసారిగా ట్రంప్‌ బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో 6.5 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో చేరారు. ట్రంప్‌ ఆస్తులు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పెరగలేదని బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.

అసత్యాల కేసులో జరిమానా..
ఇదిలా ఉండగా ట్రంప్‌ సంపద గురించి అసత్యాలు చెప్పిన కేసులో దిగువ కోర్టు ఆయనకు రూ.3,788 కోట్ల (500 మిలియన్ డాలర్లు) భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. దానిని నిలిపివేయాలని ట్రంప్‌ ఇటీవల కోర్టులో అప్పీల్‌ చేశాడు. దానిని విచారణ చేసిన న్యాయస్థానం మొత్తాన్ని 175 మిలియన్‌ డాలర్లు(రూ.1,460 కోట్లు)కు తగ్గించింది. ఆ మొత్తాన్ని పది రోజుల్లో ట్రంప్‌ చెల్లిస్తే రూ.3,788 కోటుల చెల్లించకుండా నిలుపుదల చేస్తామని స్పష్టం చేసింది.

పెరిగిన ట్రంప్‌ సోషల్‌ మీడియా షేర్ల ధర
ఇదే సమయంలో ట్రంప్‌ సోషల్‌ మీడియా కంపెనీ ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ 29 నెలల తర్వాత డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్పుతో విలీనం అయింది. ఆ కంపెనీలో ట్రంప్‌కు ఉన్న 58 శాతం వాటా విలువ 3.9 బిలియన్‌ డాలర్లు. ఇక డీడబ్ల్యూఏసీ షేర్లు సోమవారం 49.95 డాలర్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాదిలో ట్రంప్ మీడియా షేర్లు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. సుమారు 185 శాతం పెరిగాయి. ఇలా కాలం కలిసి రావడంతో ట్రంప్‌ షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో ట్రంప్‌ సంపద భారీగా పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు చేరింది.