Mass Layoffs: ప్రపంచ మార్కెట్లో కరోనాతో మొదలైన ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్థిక మాణ్యం సాకుతో కొన్ని కంపెనీలు.. నైపుణ్యం సాకుతో మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. వేట ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఉద్యోగాలు కోల్పోవుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల, వడ్డీ రేట్ల ఒత్తిడి, మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణతో అనేక రంగాలలో ఉద్యోగాల భద్రత ప్రమాదంలో పడింది. కంపెనీలు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భారీ స్థాయిలో సిబ్బందిని తగ్గిస్తున్నాయి.
ఊడుతున్న ఉద్యోగాలు..
ఇటీవలి నెలల్లోనే యూపీఎస్ నుంచి మొదలుకుని మెటా వరకు అనేక బహుళజాతి సంస్థలు ఒకేసారి వేలమంది ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం యూపీఎస్ సంస్థ 48 వేల ఉద్యోగాలలో కోత విధించింది. అమెజాన్ 30 వేల వరకు సిబ్బందిని తగ్గించింది. ఇంటెల్ 24 వేలు, నెస్లే 16 వేల మందికి లే ఆఫ్ ప్రకటించాయి. ఇక యాక్సెంచర్, ఫోర్డ్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో కూడా తొలగింపు లెక్క వేలల్లోనే ఉంది. కొత్తగా ఎదుగుతున్న నోవో నోర్డిస్క్ 9 వేల మందిని వదిలించుకుంది. పీడబ్ల్యుసీ, సేల్స్‌ఫోర్స్, ప్యారమౌంట్, టార్గెట్ తదితర కంపెనీల్లో కూడా భారీగా ఉద్యోగాల కోత పెట్టింది. తొలగింపు కేవలం ఐటీ లేదా టెక్ రంగం వరకే పరిమితం కావడం లేదు. ఉత్పత్తి, రవాణా, ఆహార ప్రాసెసింగ్, రిటైల్ రంగాలు కూడా ఈ కక్ష్యలోకి చేరాయి.
ఏఐ ఎఫెక్ట్ తో కొత్త ముప్పు
స్మార్టర్ టెక్నాలజీతో పనులను ఆటోమేట్ చేయడం వల్ల సిబ్బంది అవసరం తగ్గిపోతోంది. ఇది సంస్థల వ్యయాన్ని తగ్గించినా, మనుషుల ఉపాధిని ప్రమాదంలో పడేస్తోంది. వివిధ సంస్థలు తమ భవిష్యత్తు వ్యూహాలను ఏఐ, రోబోటిక్స్ ఆధారంగా పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. ఉద్యోగ భద్రత క్షీణించడం వినియోగదారుల మార్కెట్‌ను కూడా ప్రభావితం చేస్తోంది. కుటుంబాల ఆదాయం తగ్గడంతో కొనుగోలు శక్తి తగ్గి, కొత్త పెట్టుబడుల వేగం మందగిస్తోంది. ఫలితంగా మరిన్ని కంపెనీలు ఖర్చు అదుపు విన్యాసాల్లో పడుతున్నాయి.
నిపుణుల అంచనాల ప్రకారం ఈ ధోరణి కొంతకాలం కొనసాగవచ్చు. ఏఐ ఆధారిత పనితీరుకు మలచుకోగల కొత్త నైపుణ్యాలు మాత్రమే భవిష్యత్తు సురక్షిత మార్గం అవుతాయి. కానీ ఈ మార్పు మనుషుల ఉపాధి స్థాయిలను ఎటు వైపు తీసుకెళ్తుందో కాలమే నిర్ణయిస్తుంది.