Reason for IT job layoffs: ఐటీ జాబ్ అనగానే.. హైఫై లైఫ్.. వారంలో ఐదు రోజులే పని.. ఐదు అంకెల జీతం.. వీకెండ్‌లో రంగుల ప్రపంచం.. ఇదీ అందరికీ గుర్తొచ్చేది. కానీ, ప్రస్తుతం ఐటీ సెక్టార్ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. టెన్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ కాకపోవడం ఒక కారణం అయితే.. ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) అటీ నిపుణుల పాలిట శాపంగా మారింది. గతేడాది వరకు ఆర్థిక మాంద్యం, నైపుణ్యం సాకుతో ఉద్యోగులను కుదించిన కంపెనీలు ఇప్పుడు ఏఐని కూడా జోడించాయి. దీంతో బడా కంపెనీల నుంచి చిన్న స్టార్టప్ కంపెనీల వరకు అన్నీ ఉద్యోగాలను ఊచకోత కోస్తున్నాయి. 2025లో గడిచిన ఆరు నెలల్లో 549 కంపెనీలు అధికారికంగా 1.50 లక్షల ఉద్యోగాలు తొలగించాయి. అనధికారికంగా 2 లక్షలకుపైనే కోత పెట్టినట్లు సమాచారం. అంటే రోజుకు సగటున 500 మంది ఐటీ నిపుణులు కొలువు కోల్పోతున్నారు. మారుతున్న టెక్నాలజీ అవసరాలు ఈ లేఆఫ్‌లకు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి.
తాజాగా టీసీఎస్ కూడా..
టీసీఎస్, భారతదేశ ఐటీ రంగంలో అగ్రగామిగా గుర్తింపబడే సంస్థ, 2025లో తన ప్రపంచ ఉద్యోగుల సంఖ్యలో 2% (సుమారు 12,261 మంది) తొలగించాలని ప్రకటించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ ప్రకారం, ఈ కోతలు ఏఐ ఆధారిత ఉత్పాదకత వల్ల కాదు, కానీ నైపుణ్య అసమానతలు, డిప్లాయ్‌మెంట్ సాధ్యత లేకపోవడం వల్ల జరిగాయి. కంపెనీ తన భవిష్యత్–సిద్ధమైన వ్యూహంలో భాగంగా ఏఐ, కొత్త మార్కెట్లు, నెక్ట్స్ జనరేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులను పెంచుతోంది. ఈ లేఆఫ్‌లతోపాటు, టీసీఎస్ రీస్కిల్లింగ్, రీడిప్లాయ్‌మెంట్, కౌన్సెలింగ్ సహాయం వంటి సపోర్ట్ సేవలను అందిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్‌ల తుఫాన్..
2025 మొదటి ఆరు నెలల్లో, ప్రపంచవ్యాప్తంగా 94,000 కంటే ఎక్కువ టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు, ఇందులో అమెజాన్, మెటా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలతోపాటు చిన్న స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. జనవరి నుంచి జూలై వరకు, 549 కంపెనీలు 1.50 లక్షల మందిని అధికారికంగా తొలగించాయి. ఇంటెల్ 15–20% ఉద్యోగులను (సుమారు 21 వేల మంది) తొలగిస్తామని పకటించగా, మైక్రోసాఫ్ట్ 15 వేల మందిని, మెటా 3,600 మందిని, అమెజాన్ 14 వేల మందిని తొలగించాయి. ఈ కోతలు ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఫిన్‌టెక్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ వంటి వివిధ రంగాలను ప్రభావితం చేశాయి. ఏఐ ఆధారిత ఆటోమేషన్, ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్ ఒత్తిడి వంటి కారణాలు ఈ లేఆఫ్‌లకు దోహదపడ్డాయి.
ఏఐ, ఆటోమేషన్ ఎఫెక్ట్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఆటోమేషన్ టెక్ రంగంలో లేఆఫ్‌లకు ఒక ప్రధాన డ్రైవర్‌గా గుర్తించబడుతున్నాయి, అయినప్పటికీ కంపెనీలు దీనిని బహిరంగంగా అంగీకరించడానికి వెనుకాడుతున్నాయి. అమెజాన్ సీఈవో ఆండీ జాసీ ఏఐ సామర్థ్యాలు కొన్ని రకాల ఉద్యోగాల అవసరాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. మెటా రియాలిటీ ల్యాబ్స్ డివిజన్, ఏఆర్/వీఆర్ టెక్నాలజీలపై పనిచేస్తున్న విభాగం, ఆటోమేషన్ కారణంగా గణనీయమైన కోతలను చూసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 41% యజమానులు రాబోయే ఐదేళ్లలో ఆటోమేషన్ కారణంగా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని యోచిస్తున్నారు. అయితే, ఏఐతోపాటు, నైపుణ్య అసమానతలు, క్లయింట్ ఖర్చు తగ్గింపు ఒత్తిడి, ఆర్థిక అనిశ్చితులు కూడా ఈ కోతలకు కారణమవుతున్నాయి.
యుద్ధాల ప్రభావం..
2025లో టెక్ రంగంలో లేఆఫ్‌లకు ఆర్థిక అనిశ్చితులకు ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణ, చైనా–యూఎస్ వాణిజ్య యుద్ధం వంటి అంశాలు కూడా కారణం. టీసీఎస్ సీఈవో కృతివాసన్ ప్రకారం, మాక్రో ఎకనామిక్, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా డిమాండ్ సంకోచం ఏర్పడింది. ఇది నిర్ణయాత్మక ఆలస్యతలకు దారితీసింది. అదనంగా, క్లయింట్లు 20–30% ధర తగ్గింపులను డిమాండ్ చేస్తున్నారు. ఇది టెక్ కంపెనీలను తమ ఖర్చు నిర్మాణాన్ని పునర్విమర్శించేలా ఒత్తిడి చేస్తోంది.