AP- Telugu Language: దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయులు వందల ఏళ్ల కిందటే చాటిచెప్పారు. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని తెలుగు భాష అరుదైన గౌరవం దక్కించుకుంది. కానీ ఇప్పుడు ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అత్యధికంగా మాట్లాడే భాష జాబితా నుంచి కిందకు వెళుతోంది. పరభాష వ్యామోహంలో పడి మాతృ భాషను మరిచిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలుగానే కొనసాగుతున్నాయి. కానీ భాష ప్రభ తగ్గుతుండడం మాత్రం విస్మయపరుస్తోంది. పరభాష వ్యామోహంతో ఇంటి భాష, బడి భాష వేరవుతున్నాయి. ఇంటి భాష పదజాలంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేట్, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో మాతృభాష మాట్లాడితే జరిమానాలు విధిస్తున్నారు. యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తుండగా.. పాలకులు ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెలుగు భాష, యాస నానాటికీ కనుమరుగవుతోంది. జాతీయాలు, నుడీకారాలు, సామేతలు లేకుండా మాటలు సాగిపోతున్నాయి. తెలుగును బతికించాలని చర్చలతో సరిపెడుతున్నారు. తెలుగును కాపాడడంలో మాత్రం అలసత్వం చూపిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వాల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఉత్తర ప్రత్యుత్తరాల్లో తెలుగును తప్పనిసరి చేసింది. తెలుగు భాషను వాడకపోతే జైలు, జరిమానా విధించేలా ఆదేశాలిచ్చింది.
తాజాగా ఉత్తర్వులు..
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగును కాపాడాలని కొద్దిరోజుల కిందటే భాషాభిమానులు ప్రభుత్వానికి విన్నవించారు. దేశంలో తెలుగు భాషకున్న గొప్పదనాన్ని వివరించి.. ఔన్నత్యాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలుగు భాష వాడకాన్ని తప్పనిసరిచేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాధికార సంస్థను కూడా ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. పాలన భాషగా తెలుగును అమలుచేయాలని వ్యవస్థలకు, సంస్థలకు, అన్ని శాఖలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. చివరకు తమ దుకాణాల పేర్లు కూడా తెలుగులో రాయాలని వ్యాపారులకు ఆదేశాలచ్చింది. పాఠశాలల్లో కూడా తెలుగును పక్కాగా అమలుచేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసేవారిపై అవసరమైతే పోలీస్ కేసులు నమోదుచేస్తామని..జైలుశిక్ష విధిస్తామని అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
Also Read: Modi- KCR: ఏపీ కోసం మోడీ ఆదేశాలు.. కేసీఆర్ వింటారా? డౌటే?
భాషాభిమానుల హర్షం..
ప్రభుత్వ తాజా నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2022 ఆగస్టు 29ను శుభదినంగా పేర్కొంటున్నారు. దేశంలోనే తెలుగు ప్రాచీనమైన భాష. అందుకే ప్రాచీన హోదా దక్కించుకుంది. నాలుగు దశాబ్దాల కిందట హిందీ తరువాత దేశంలో అత్యధిక మంది మాట్లాడేది తెలుగు భాషే. అటువంటిది ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరుంది. హిందీ తరువాత బెంగాళి, మరాఠీ భాషలు తర్వాత స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. రెండు నుంచి నాలుగో స్థానానికి తెలుగు దిగజారింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరిగాలని ఆదేశాలివ్వడమే కాకుండా కఠినంగా అమలుచేస్తే మాత్రం తెలుగుకు పూర్వ వైభవం ఖాయం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jail in ap if you dont use telugu from tomorrow because
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com