NRI Groom: భారత వివాహ బంధం చాలా గొప్పది. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు జరిగినా.. ఇప్పటికీ మన వివాహ బంధానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే మన వివాహ వ్యవస్థలో ఒకప్పుడు కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకునేవారట. తర్వాత అమ్మాయిలే కట్నం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో మళ్లీ కన్యాశుల్కం ఖాయమంటున్నారు నిపుణులు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం ఒకటైతే.. అమ్మాయిలు పెట్టే కండీషన్లు మరో కారణం. అమెరికాలో స్థిరపడిన వారికి కూడా పెళ్లిల్లు కాకపోవడమే పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.
40 ఏళ్లు వచ్చినా..
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో జీవితంలో స్థిరపడాలన్న కారణంతో పెళ్లిళ్లు వాయిదా వేస్తున్నారు. మరో కారణం.. అమ్మాయిలు తగ్గడం. సంబంధాలు చూస్తున్నా పిల్ల దొరకడం లేదు. తెలంగాణకు చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి రూ.50 లక్షలకుపైగా సంపాదిస్తున్నాడు అమెరికాలో ఇల్లు, కారు ఉన్నాయి. చింతలేని లైఫ్. కానీ అతనికి ఇంకా పెళ్లి కాలేదు. 40 ఏళ్లు దగ్గరకు వచ్చినా పిల్ల దొరకడం లేదు. వచ్చిన సంబంధాలు రిజక్ట్ చేస్తున్నాయి. కారణం. అతనికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆస్తులు లేకపోవడమే. దీంతో ఎన్నారైకి పిల్లను ఇవ్వడానికి వెనుకాడుతున్నారు.
ఎన్నారైలపై ఎన్నో అనుమానాలు..
ఇక మరోవైపు ఎన్నారై పెళ్లి కొడుకు అంటే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో మంచి పొజిషన్‌లో ఉన్నా.. ఆడపిల్లల తల్లిదండ్రులు వారికి పిల్లను ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఎన్నారై అంటే గెంతులేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అక్కడి కల్చర్‌కు అలవాటు పడి అమ్మాయిలను వేధించడం, ఇండియాలో వదిలేసి పోయేవారి సంఖ్య పెరగడం కూడా ఓ కారణం.
ఉద్యోగం పోతే ఎలా అనే ప్రశ్న !
ఇక కొందరు తల్లిదండ్రులు ఎన్నారైలకు ఉద్యోగం ఉన్నంత వరకే గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కంపెనీలు తొలగిస్తే పరిస్థితి ఏంటన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక మాంద్యం కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ లేదా ఆంధ్రాలో ఆస్తులు ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుడే ఉద్యోగం పోయినా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఈ కారణంగా కూడా ఎన్పారై పెళ్లి కొడుకులకు సంబంధాలు రావడం లేదు.
చేతులెత్తేస్తున్న మ్యాట్రిమొనీ కంపెనీలు..
ఒకప్పుడు విదేశాల్లో ఉద్యోగం చేసే అవ్బాయిలకు మంచి డిమాండ్ ఉండేది. దీంతో ఇలాంటి సంబంధం కుదిరిస్తే తమకు కమీషన్ కూడా బాగా వస్తుందని మ్యాట్రిమొనీ కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎన్నారై సంబంధం కుదుర్చడం అంత ఈజీ కాకపోవడంతో చేతులు ఎత్తేస్తున్నాయి వధువుల తల్లిదండ్రుల్లో స్పష్టమైన మార్పు నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన వారికి కూడా పిల్లను ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.