PV Narsimha Rao: పాముల పర్తి వెంకట నరసింహారావు.. ఈ పేరు చెబితే చాలా మందికి తెలియదు.. కానీ, పీవీ. నర్సింహారావు అంటూ అందరూ గుర్తుపడతారు. భారత దేశానికి ఇప్పటి వరకు దక్షిణాది నుంచి ఎన్నికైన ఏకైక ప్రధాని. రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, గొప్ప పండితుడు పీవీ. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగలు తెలుగు నవలను పీవీ హిందీలోకి అనుమతించారు. భారత ప్రధాన మంత్రి పదవి అధిష్టించిన మొదటి దాక్షిణాది వాసి. ఒకే ఒక్క తెలుగువాడు. 1921, జూన్ 28 జన్మించిన పీవీ బహుభాషావేత్త. రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందినవాడు. దేశ ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వ్యక్తి పీవీ. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పీవీ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు.
తొలి జీవితం..
తెలంగాణలోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ.జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి పీవీ పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతర గీతం పాడారు. దీంతో ఆయనను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. తర్వాత ఓ మిత్రుడిసాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుంచి 1944 వరకు ఎల్ఎల్బీ చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల మార్గదర్శకత్వంలో స్వాతంత్య్ర ఉద్యమంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పీవీ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్‌తో కలిసి పనిచేసారు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు.
రాష్ట్ర రాజకీయాల్లో..
పీవీ.నర్సింహారావు 1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుంచి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగా, 1964 నుంచి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968–71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.
ముఖ్యమంత్రిగా..
1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని వ్యక్తిత్వం, పార్టీలో ఏ గ్రూపు లేని ఆయన రాజకీయ నేపథ్యం పీవీకి 1971, సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. ఇక ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదు మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాద్‌లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో ముల్కీ నిబంధనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని జై ఆంధ్ర పేరుతో ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973, జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాతి రోజే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అసెంబ్లీని శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన పెట్టింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు
కేంద్ర రాజకీయాల్లో..
తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుంచి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్లీ హనుమకొండ నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి గెలిచారు. తర్వాత కూడా రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి పదో లోక్‌సభలో పీవీ. అడుగు పెట్టారు. 1980 – 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించాడు.
ప్రధానమంత్రిగా..
పీవీని ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పీవీ పోటీ చేయలేదు. దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే అదే ఏడాది రాజీవ్‌గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండే, అందరికీ ఆమోదయోగ్యుడైన పీవీ అధిష్టానానికి ఆశాదీపం అయ్యాడు. దాదాపుగా వానప్రస్థం నుంచి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. అయితే సహజంగా ఆయనకు ఉన్న తెలివితేటలు, రాజనీతిజ్ఞత, కేంద్రంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు దోహదపడ్డాయి. ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల తర్వాత బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు.
పీవీ విజయాలు
పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేశాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్‌సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. నాటి సంస్కరణల పర్యవసానమే, ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన వృద్ధికి కారణం. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. ఇజ్రాయోల్తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరాన్‌తో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షలను మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు.
పీవీపై విమర్శలు..
పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించినవే.
– 1994లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుంచి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
– 1992, డిసెంబర్ 6 న అయోధ్యలో బాబ్రీమసీదును కూలగొట్టిన సంఘటన ఆయన ఐదేళ్ల పాలనలోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
– ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు.
అవినీతి ఆరోపణలు
ఐదేళ్ల పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలని పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుంచి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయన్ని వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. ఆయన మరణానికి సరిగ్గా ఏడాది ముందు వీగిపోయింది.
– జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు:
పార్లమెంటులో బల నిరూపణకు జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000, సెప్టెంబర్ 29న పీవీని ఈ కోసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి పూర్వ ప్రధానమంత్రి పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
– సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు..
1989 లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీతో విభేదించి, ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వీపీ.సింగ్ ను అప్రదిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్‌ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎకౌంటు తెరిచిన కేసిది.
– లఖుభాయి పాఠక్ కేసు..
లఖుబాయి పాఠక్ అనే పచ్చళ్ల వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పీవీకి సన్నిహితుడైన రామచంద్రస్వామికి డబ్బులు ఇచ్చాడని ఆరోపించాడు.
పై మూడు కేసుల్లోను పీవీ నిర్దోషిగా పైకోర్టులు తీర్పిచ్చాయి. ఈ మూడు కాకుండా స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతాను తాను సూట్‌కేసులతో పీవీకి డబ్బులు ఇచ్చానని ఆరోపించాడు. అయితే అది నిరాధారమని తేలింది.
సాహితీ కృషి
రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ఇష్టంమైన సాహిత్య కృషి, కంప్యూటర్ను ఉపయోగించడం వంటివి చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. పీవీ చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇ¯Œ సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషిగా ఇది తెలుగులోకి అనువాదమయింది.
పీవీ రచనలు..
సహస్రఫణ్..
విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికి పీవీకి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది.
అబల జీవితం..
పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అనువదించారు.
ఇన్సైడర్: ఆయన ఆత్మకథ. ఇది వివిధ భాషల్లోకి అనువాదమైంది.
ప్రముఖ రచయిత్రి ‘జయ ప్రభ‘ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు.
ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో రాశాడు. కాంగ్రెస్‌వాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది.
తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004, డిసెంబర్ 23 న వీపీ.నరసింహారావు కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
పీవీ విశిష్టత
– బహుభాషా పండితుడు, పీవీ నర్సింహారావుత తెలుగుతోపాటు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయన సొంతం. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్‌లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరచాడు.
– పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రధాన మంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచాడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన.
పీవీ నిర్వహించిన పదవులు
1951 అఖిల భారత కాంగ్రెసు కమిటీ సభ్యత్వం
1957–77 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యత్వం
1962–64 ఆంధ్రప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1964–67 ఆంధ్రప్రదేశ్ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
1967 ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
1968–71 ఆంధ్రప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1971–73 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
1977 లోక్‌సభ సభ్యత్వం
1980 లోక్‌సభ సభ్యత్వం
జనవరి 1980–జూలై 1984 కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రి
జూలై 1984–డిసెంబర్ 1984 కేంద్ర హోం శాఖమంత్రి
1984 లోక్‌సభ సభ్యత్వం (మూడో సారి)
1984, నవంబర్ – ఫిబ్రవరి 1985 భారత ప్రణాళిక శాఖ మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా.
జనవరి 1985–సెప్టెంబర్ 1985 కేంద్ర రక్షణ శాఖమంత్రి
సెప్టెంబర్ 1985–జూన్, 1988 కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
1986, జూలై – ఫిబ్రవరి 1988 కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి
జూన్ 1988–డిసెంబర్ 1989 విదేశ వ్యవహారాల శాఖ మంత్రి
1989 లోక్‌సభ సభ్యత్వం(నాలుగోసారి)
1991, మే 29 – 1996 అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
1991, జూన్ – 1996, మే 10 ప్రధానమంత్రి
నవంబర్ 1991 ఉప ఎన్నికలలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదవసారి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Interesting facts about the life of pv narsimha rao
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com