వేలంపై వెనక్కి తగ్గిన టీటీడీ..!

శ్రీవారి భూముల వేలం వివాదాస్పదం అవడంతో ఈ వ్యవహారంపై టిటిడి వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాలు, హిందూ సంస్థలు, స్వపక్షం నుంచి వచ్చిన వత్తిడికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. గత పాలకవర్గ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, టీటీడీ బోర్డు సమావేశంలోనూ ప్రధానంగా భూములు, ఆస్తులు, భక్తులు సమర్పించిన కానుకలు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించకూడదని నిర్ణయం తీసుకుంది. పాలకవర్గ సమావేశం వివరాలను టీటీడీ చైర్మన్ వివరిస్తూ నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతం అవకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, […]

Written By: Neelambaram, Updated On : May 29, 2020 11:08 am
Follow us on


శ్రీవారి భూముల వేలం వివాదాస్పదం అవడంతో ఈ వ్యవహారంపై టిటిడి వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాలు, హిందూ సంస్థలు, స్వపక్షం నుంచి వచ్చిన వత్తిడికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. గత పాలకవర్గ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, టీటీడీ బోర్డు సమావేశంలోనూ ప్రధానంగా భూములు, ఆస్తులు, భక్తులు సమర్పించిన కానుకలు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించకూడదని నిర్ణయం తీసుకుంది. పాలకవర్గ సమావేశం వివరాలను టీటీడీ చైర్మన్ వివరిస్తూ నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతం అవకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, ఈ కమిటీలో పాలక మండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులకు చోటు కల్పిస్తామని చెప్పారు.

టీటీడీఆస్తులు విక్రయిస్తున్నారనే దుష్ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో టిటిడి పాలకమండలిపై ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాల్సిందేనని బోర్డు తీర్మానించిందని చెప్పారు. అలాగే టీటీడీ పరిధిలోని అతిథి గృహాలను నిబంధనలకు విరుద్ధంగా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు. అతిథి గృహాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని బోర్డు తీర్మానించినట్లు వివరించారు. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని టీటీడీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డొనేషన్‌ స్కీమ్‌లోనూ అర్హులకే అతిథి గృహాలు ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాకే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భౌతికదూరం పాటించి దర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

టీటీడీకి చెందిన భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. టీటీడీ కి చెందిన సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదని అన్నారు. గతంలో వివిధ దశల్లో విక్రయించినవి, దురాక్రమణ కు గురైనవి, అందుబాటులో ఉన్న ఆస్తుల సమగ్ర సమాచారం శ్వేత పత్రంలో ఉండాలని సూచించినట్లు చెప్పారు. 2016 లో ఆస్తుల విక్రయానికి గత ప్రభుత్వం నియమించిన బోర్డు నిర్ణయం తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ ఆస్తుల అమ్మకం ప్రక్రియకు సంబంధించి వివిధ దశల్లో ఎక్కడ ఏం జరిగిందో తేల్చేందుకు సమగ్ర విచారణకు కోరుతూ ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని అధికారులను ఆదేశించానని తెలిపారు.