YCP Bus Yatra: వైసీపీ నేతలు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నిలదీతలు ఎదురుకావడంతో సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు నాలుగు రోజులపాటు మంత్రులు నిర్వహించిన బస్సు యాత్ర పూర్తిగా విఫలమైంది. ప్రజల నుంచి ఎక్కడా సానుకూల స్పందన లేదు. బెదిరించి.. బతిమాలి డ్వాక్రా సంఘాలను, ఉపాధి కూలీలను డబ్బులిచ్చి తరలించుకు వచ్చినా.. ఎండలకు తాళలేక వారంతా వెనుదిరిగారు. ఆదివారం చివరి రోజు ఏ సభలో చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. గ్యాలరీలు బోసిపోయాయి. ఉదయం కర్నూలు సీ క్యాంపు సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. 11 గంటలకు రావలసిన మంత్రులు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. మండుటెండల్లో జనం అల్లాడిపోయారు. తాగడానికి గుక్కెడు నీరిచ్చినవారే లేరు. మంత్రులు ప్రసంగించే సమయంలో మజ్జిగ, వాటర్ ప్యాకెట్ల వాహనం రావడంతో ఉన్న కొద్ది మంది జనం అటువైపు పరుగులు తీశారు. సభ మొదలు కాగానే మహిళలు వెళ్లిపోవడంతో వందల సంఖ్యలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. మంత్రులు వచ్చే వరకు సభలో మహిళలను కూర్చోబెట్టేందుకు నాయకులు నానా తంటాలు పడ్డారు. నంద్యాలలో మరీ ఘోరం. ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో అసహనంతో మంత్రి బొత్స కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్లిపోయారు.
బస్సుకే మంత్రులు పరిమితం..
17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు బస్సు యాత్రలో పాల్గొనున్నట్టు ప్రకటించారు. కానీ నాలుగురోజుల కార్యక్రమంలో ఏ చోటాసామ పూర్తిస్థాయిలో వారు హాజరుకాలేదు. కర్నూలు జిల్లాలో బొత్స సత్యనారాయణ, నారాయణస్వామి, గుమ్మనూరు జయరాం, అంజాద్‌బాషా, ఆదిమూలపు సురేశ్, చెల్లుబోయిన వేణగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్, ఉషశ్రీ చరణ్, విడదల రజిని, మేరుగ నాగార్జున మాత్రమే వేదికపైకి వచ్చారు.
Also Read: CM KCR-KTR: దసరాకు కేసీఆర్ నిర్ణయం..కేటీఆర్ సీఎం కాబోతున్నారా?
తానేటి వనిత, ముత్యాలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, రాజన్నదొర బస్సు దిగలేదు. స్నాక్స్ తింటూ లోపలే కూర్చుండిపోయారు. వేదికపైకి వచ్చినవారిలో సురేశ్, జయరాం మాత్రమే ప్రసంగించారు. మిగిలిన వారు ప్రజలకు అభివాదం చేసి వెంటనే బస్సెక్కారు. అంతకుముందు నంద్యాల శ్రీనివాస సెంటర్ సభలోనూ ఇంతే. ప్రజాస్పందన పెద్దగా లేదు. దీంతో ఉదయం 9.50కి మొదలైన సభ 10.15కి ముగిసింది. హాజరైనవారిలో ఎక్కువ మంది ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా సంఘాల వారే. ఒక్కొక్కరికీ వైసీపీ నాయకులు రూ.200 ఇచ్చి తీసుకొచ్చారు. కానీ ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉండడంతో.. మంత్రులు మాట్లాడుతుండగానే వారంతా ఇళ్లకు పయనమయ్యారు.
పొడిపొడిగా మాట్లాడేసి…
ఇద్దరు మంత్రులు కేవలం పది నిమిషాలు మాట్లాడి ముగించేశారు. ఎక్కువ మంది మంత్రులు మాట్లాడాలని కోరవద్దని స్థానిక ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డికి మంత్రి బొత్స సూచించడం గమనార్హం. చివరిగా సాయంత్రం అనంతపురంలో బస్సు యాత్ర ముగిసింది. 4 గంటలకు మొదలవ్వాల్సిన ముగింపు సభ ఆరు గంటలకు ప్రారంభమైంది.
మధ్యాహ్నమే వందలాది ఆటోలు, బస్సుల్లో జనాలను తీసుకొచ్చారు. రెండు గంటలు వేచిచూసిన డ్వాక్రా మహిళలు.. తీరా సభ ప్రారంభం కాగానే ఇంటిబాట పట్టారు. కార్యకర్తలూ ఒక్కొక్కరుగా జారుకున్నారు. ప్రాంగణంలో పది గ్యాలరీలు ఉండగా.. ముందు రెండు గ్యాలరీల్లో వైసీపీ శ్రేణులు కనిపించారు. మిగిలిన గ్యాలరీల్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సభలు జరిగిన ప్రతి చోటా గంటల ముందే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కర్నూలు జిల్లాలో మంత్రి బొత్స అసహనంతో కనిపించారు. నగర మేయర్ బీవై రామయ్య దఫేదారుపై చేయిచేసుకున్నారు. నన్నూరు టోల్‌ప్లాజా నుంచి ర్యాలీగా వస్తుండగా నంద్యాల చెక్‌పోస్టు వద్ద దామోదరం సంజీవయ్య విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసేందుకు బస్సు ఆపారు. బస్సు దిగిన బొత్సకు దఫేదారు అడ్డంగా ఉండడంతో కోపంతో చేయిచేసుకున్నారు. కాస్త ముందుకు వెళ్లాక బైకుపై ఉన్న యువకుడిపైనా చేయిచేసుకున్నారు. అడ్డంగా వస్తారా అంటూ బూతులు తిట్టుకుంటూ సాగారు.
Also Read:IPL Final Mania : ఐపీఎల్ ఫైనల్ మేనియా: టైటిల్ గుజరాత్ దా? రాజస్థాన్ దా?