Amalapuram Incident: ‘అనుమానితుల వాట్సాప్ చాట్స్ చూస్తున్నాం. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నాం. వారు భోజనానికి వెళ్లే సమయమిది. ఇదే మంచి టైమ్. యుద్ధానికి సిద్ధమంటూ చాట్స్’..అమలాపురం విధ్వంసం ఘటనకు సంబంధించి పోలీసులు రోజుకో తీరులో చెబుతున్న మాటలివి. రోజులు గడుస్తున్నా కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నమేమీ జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అసలు నిందితులను తప్పించి కొసరు నిందిుతలపై కేసులు నమోదుచేయడంపై విపక్షాలు తప్పుపడుతున్నాయి పోలీసుల నిర్లక్ష్యం, కేసు జాప్యం చూస్తుంటే.. దీని వెనుక అధికార పార్టీ నేత హస్తం ఉందన్న విపక్షాల ఆరోపణలు మరింత బలం చేకూరుస్తున్నాయి. అమలాపురం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సాక్షాత్ ఓ మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇళ్లపై విధ్వంసానికి దిగి తగలబెడితే అదో సిల్లీ విషయంగా తీసుకోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం, యంత్రాంగం దీన్నో సవాల్ గా తీసుకొని నిందితుల్ని .. దాని వెనుక ఉన్న కుట్ర దారుల్ని పట్టుకుని కఠిన చర్యలకు ఉపక్రమిస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పోలీసులు మాత్రం సోషల్ మీడియా ను నిశితంగా పరిశీలిస్తున్నామని..ఇంటర్నెట్‌ను వారం రోజుల పాటు నిలిపివేసి.. అదే గొప్ప విజయంగా చెప్పుకొస్తున్నారు.
అమలాపురం ఘటన జరిగిన నాటి నుంచి ప్రతీ రోజూ పోలీసులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ పట్టుకున్న నిందితులు ఎవరెవరు..? వారి వెనుక ఉన్నదెవరు..? ఏ ఉద్దేశంతో వారు ఈ దాడులకు పాల్పడ్డారు వంటి విషయాలను మాత్రం వెల్లడించడం లేదు. సీసీ టీవీల్లో , మీడియా కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం అరెస్ట్ చేసిన వారిలో అత్యధికులు వైసీపీ కార్యకర్తలే. మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులే. తాజాగా శనివారం మరో 25 మంది నిందితుల పేర్లు బయటపెట్టారు.
Also Read: YCP Bus Yatra: వైసీపీ మంత్రులకు ఘోర అవమానం.. అలిగి వెళ్లిపోయిన బొత్స
డీఐజీ పాల్ రాజు, కోనసీమ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, కాకినాడ ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు మాధవీలత, చక్రవర్తిలు పాల్గొన్నారు. బస్సుల దహనం, వజ్ర వాహనంపై దాడి, మంత్రి పినిపే విశ్వరూప్ క్యాంపు కార్యాలయం దహనం కేసుల్లో అమలాపురం పరిసర మండలాలకు చెందిన 25 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. ఆందోళనలో పాల్గొన్న సహ నిందితులు ఇచ్చిన సమా చారం, సోషల్ మీడియాలో యాక్టివ్ పార్టులో ఉన్న కొందరిని నిందితులుగా గుర్తిస్తున్నామన్నారు.
మొత్తం ఎపిసోడ్ వెనుక వైసీపీ కీలక నేత ఉన్నట్టు ఆరోపణలు ప్రారంభం నుంచే వినిపిస్తున్నాయి. అసలు కోనసీమ ఉద్యమాన్ని రెచ్చగొట్టి.. కోనసీమ సాధన సమితి పేరుతో రాజకీయాలు చేసింది కూడా సదరు నేతే. ప్రస్తుతం ఆయన రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. అయితే పోలీసులు ఈ మాత్రం ఈ కుట్రను చేధించడంలో ఆలసత్వం ప్రదర్శిస్తున్నారు. తాను నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పడానికి రోజుకో మాట చెబుతున్నారు కానీ.. అసలు విషయం చెప్పడం లేదు. దీంతో విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా.., ఇదందా వైసీపీ నేతల పనేనన్న అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తొలుత ప్రభుత్వ పెద్దలు సైతం ఈ ఘటన వెనుక టీడీపీ, జనసేనలు ఉన్నట్టు ఆరోపణలు చేశారు. పోనీ ఆ ఆరోపణలకు కట్టుబడి అరెస్ట్ లు చేశారంటే అదీ లేదు. కేవలం రాజకీయ కుట్ర కోణంలో విధ్వంసానికి తెగబడ్డారని అందరికీ తెలుసు. కానీ కేసును ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేయకపోవడంతో సహజంగానే ప్రజల్లో అధికార పార్టీపై అనుమానాలు పెరుగుతాయి. ఈ విషయంలో నివ్రుత్తి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.
Also Read:IPL Winner Gujarat Titans : ఐపీఎల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ ఎలా నిలిచింది? అసలు కారణాలేంటి?