CM KCR-KTR: తెలంగాణలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బీజేపీని టార్గెట్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వం రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాల సీఎంలు, నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మూడో కూటమి ఏర్పాటుపై ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదే సమయంలో కేటీఆర్ ను సీఎం చేయాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలోనే కేటీఆర్ ను సీఎంగా చేయాలనే డిమాండ్ వచ్చినా కొందరు వ్యతిరేకించడంతో వాయిదా పడింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎటు వైపు వెళుతున్నాయో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని ఒక వైపు బీజేపీ చెబుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడుతోంది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడంతో బీజీపీలో ధీమా పెరిగింది. దీంతో రాష్ట్రంలో తామే బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ నేతలు ప్రకటించడంతో టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు ఈ క్రమంలోనే అప్పటి నుంచి బీజేపీని టార్గెట్ చేసుకుని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కేసీఆర్ ఉత్తరాది పర్యటనలు చేస్తున్నారు. కానీ మూడో కూటమి ఏర్పాట్లు మాత్రం కొలిక్కి రావడం లేదు. దీంతో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై అందరికి అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: IPL Winner Gujarat Titans : ఐపీఎల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ ఎలా నిలిచింది? అసలు కారణాలేంటి?
గతంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఈటల రాజేందర్ వ్యతిరేకించారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా అపజయమే మిగిలింది. ఇక అప్పటి నుంచి బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ రెచ్చిపోతోంది. వరిధాన్యం కొనుగోలు నుంచి బీజేపీని అన్ని మార్గాల్లో ఎదురుదాడి చేయాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ దసరాకు కేటీఆర్ ను సీఎం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోపు అన్ని సర్దుకుని కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలనే ఉత్సాహంలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి కేసీఆర్ చేస్తున్న ఆలోచనలకు కార్యరూపం దాలుస్తుందా అనేది సందేహమే. రాష్ట్రంలో కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో కేసీఆర్ ఆలోచన ఫలిస్తుందా? కేటీఆర్ కు పదవీ యోగం ఉందా అనేది అనుమానమే.
కేటీఆర్ ను సీఎం చేయాలని ఆంధ్ర యువకుడు పాదయాత్ర చేపడుతున్నాడు. కేటీఆర్ చేస్తున్న విధానాలు నచ్చి ఆయనను సీఎం చేయాలని కోరుతూ విజయవాడ, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్నాడు. సీఎం గా కేటీఆర్ ను చూడాలనే అతడి కోరికను పార్టీ నెరవేరుస్తుందా? లేక టీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకుండా చేస్తుందా? అనేదే తేలాల్సి ఉంది. దీంతో మరోమారు కేటీఆర్ సీఎం కావాలనే డిమాండ్ వస్తుండటంతో పార్టీ నేతల తీరు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పడు వ్యతిరేకించే ఈటల రాజేందర్ లేకపోవడంతో ఎవరు కూడా ఆ సాహసం చేయరని తెలుస్తోంది.
మొత్తానికి రాష్ట్రంలో మారుతున్న సమీకరణల సందర్భంలో పరిస్థితులు ఎటు దారి తీస్తాయో తెలియడం లేదు. టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ ఆశ నెరవేరుతుందా? కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతారా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:Virata Parvam: ‘విరాట పర్వం’కు మోక్షం.. కలెక్షన్స్ పైనే అనుమానం