వైసీపీ నుంచి గెలిచి.. అసమ్మతి వాదిగా మారిన ఆ పార్టీ నేతలనే చెడుగుడు ఆడేస్తున్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇప్పటికే సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుకు ఎక్కిన రఘురామ తాజాగా తన టార్గెట్ ను విజయసాయిపైకి మళ్లించారు. విజయసాయిరెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గట్టి ఝలక్ ఇచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులో వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తాజాగా రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో సంచలన పిటీషన్ వేశారు.
వైసీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తనకున్న పలుకుబడితో హోంశాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాల్లో అధికారులను తరుచుగా కలిసే అవకాశం ఉందని.. ఆయనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయని.. ఈ నేపథ్యంలో సాక్షులను ప్రత్యక్షంగా పరోక్షంగా విజయసాయిరెడ్డి భయపెట్టగలరని పిటీషన్ లో రఘురామ సంచలన విషయాలు పేర్కొన్నారు.
ఇక సీఎం జగన్ ఆస్తుల కేసులో ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీబీఐ జేడీని నియమించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీ విజయసాయి కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని.. ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.
కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడుతూ న్యాయవ్యవస్థ పట్ల ఆయన దృక్పథాన్ని తేటతెల్లం చేస్తున్న విజయసాయి రెడ్డి ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపడానికి కోర్టు సిద్ధమైంది.