Pothula Suneetha: ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగానే వ్యాఖ్యలతో కాక రేపుతున్నారు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అధికార వైసీపీ పావులు కదుపుతోంది. దసరా నుంచి రాష్ట్ర వ్యాప్త యాత్రకు దిగుతున్న పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆయనపై మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, నేతల వరకూ విమర్శలకు దిగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కూటమితో ప్రత్యామ్నాయంగా మారుతున్న పవన్ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు దత్తపుత్రుడంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని పదే పదే ప్రస్తావిస్తూ కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విమర్శల చేసే వంతు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత వంతు వచ్చింది. ఇటీవలే ఆమె మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తన తొలి ప్రెస్ మీట్ ని పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడేందుకు కేటాయించారు.

వివాదాస్పద వ్యాఖ్యలే..
పవన్ నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఒకరు లోకల్, మరోకరు, నాన్ లోకల్, ఇంకొకరు ఇంటర్నేషనల్ అంటూ పవన్ భార్యలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక నాలుగో భార్య ఎక్కడి వారో అంటూ ఎద్దేవా చేశారు. మహిళా రక్షణ విషయమై పార్టీ వీర మహిళల సమావేశంలో పవన్ పెద్దపెద్ద మాట్లడారని గుర్తుచేస్తూ… అసలు పవన్ వద్దకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: J-Brand Liquor: ఆ బ్రాండ్ మద్యంలో విషపదార్థాలు.. మల్లగుల్లాలు పడుతున్న ఏపీ సర్కారు
మహిళల పట్ల ఆయన ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందేనన్నారు.కుటుంబం, వివాహబంధమన్నా పవన్ కు గౌరవం, నమ్మకం, విశ్వాసం లేదన్నారు.నిజానికి పవన్ ఒక సినిమా హీరో మాత్రమేనన్నారు. సినిమాలో రెండు డ్యాన్స్ లు, డైలాగులు చెబుతాడని.. అది నిజ జీవితంలో కుదరదన్న విషయం గుర్తించుకోవాలని సునీత సూచించారు. మహిళల జీవితాలతో ఆడుకున్నారని.. అందుకు ఆయన బహు భార్యత్వమే ఉదాహరణ అని చెప్పారు. ఏడడుగుల వివాహ బంధానికి ఏ విధంగా నిర్వచనం ఇచ్చారో అందరికీ తెలిసిందేనన్నారు. జీవితాంతం ఒకరితో కలిసి నడవాలన్న ఉద్దేశం పవన్ కు లేదన్నారు. పెళ్లి చేసుకొని మోజు తీరాక వదిలేయడం పవన్ నైజమంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో మహిళా రక్షణ కోసం మాట్లాడే హక్కు ఆయనకు లేదంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి పవన్ వ్యక్తిగత జీవితంపై సునీత ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.

మండిపడుతున్న జనసైనికులు..
అయితే దీనిపై జనసైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో ఆత్మస్థైర్యాన్ని పోగొట్టేందుకే కొత్త పన్నాగమంటూ అనుమానిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడితే బాగుండదని.. మీ వ్యక్తిగత జీవితాలపై మాట్లాడాల్సి ఉంటుందని గతంలోనే పవన్ హెచ్చరించారు. కానీ వైసీపీ నేతల ధోరణిలో మార్పు రాలేదు. కేవలం పవన్ ను తిట్టించడానికే అన్నట్టు వైసీపీలో కొంతమంది దూకుడు స్వభావం ఉన్న వారిని పార్టీ కార్యవర్గాల్లోకి తీసుకున్నట్టుంది. ఎక్కడైనా పార్టీ విభాగం ప్రతినిధులు బాధ్యతలు తీసుకున్న తరువాత తొలి సమావేశంలో తాము ఏం చేయదలచుకున్నది చెబుతున్నారు. కానీ పోతుల సునీత తన తొలి సమావేశాన్ని పవన్ ను టార్గెట్ గా చేసుకొని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు మానుకోకుంటే అందుకు తగ్గట్టు తాను వ్యాఖ్యానిస్తానని పవన్ గతంలోనే వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపారు. ఈ తాజా వ్యాఖ్యలతో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ.
Also Read:BJP- Amarinder Singh: సిక్కుల ప్రేమ కోసం బీజేపీ ఏం చేస్తుందో తెలుసా?