Vellamalli Srinivas Vs Samineni Udayabhanu: నా నియోజకవర్గంలో వేలుపెడితే .. నీ నియోజకవర్గంలో వేలుపెడతా`. ` దమ్ముంటే రా. నీలాగా మూడు పార్టీలు మారలేదు. నువ్వు ఊసరవెల్లివి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ` ఇవి అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య సంభాషణలు. సవాళ్లు.. ప్రతి సవాళ్లు. విజయవాడ వేదికగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రచ్చకెక్కారు. ఒకరినొకరు తోసుకునేంత దూరం వెళ్లారు.

వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్ రచ్చకెక్కారు. నువ్వెంత నువ్వెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలు వివాదానికి వేదికయ్యాయి. ఎమ్మెల్యేల పరస్పర దూషణలతో వైసీపీ కార్యకర్తలు అవాక్యయ్యారు. వివాదానికి ప్రధాన కారణం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేత ఆకుల శ్రీనివాస్ ను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లడమే. ఆకుల శ్రీనివాస్ ను సామినేని ఉదయభాను సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గం వ్యక్తిని సీఎం వద్దకు ఎలా తీసుకెళ్తావ్ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. దీనికి సామినేని ఉదయభాను ఘాటు రిప్లయ్ ఇచ్చారు. దీంతో వివాదం చినుకు చినుకు గాలివానలా మారింది.
తన నియోజకవర్గంలో వేలుపెడితే .. నీ నియోజకవర్గంలో కూడ వేలు పెడతా అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. దీంతో సామినేని ఉదయభాను దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. “ నీలాగ నేను మూడు పార్టీలు మారలేదు. నువ్వు ఊసరవెల్లివి. పార్టీలో సీనియర్ ని. ఆకుల శ్రీనివాస్ తో నాకు కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే సంబంధాలు ఉన్నాయి. సీఎం వద్దకు తీసుకెళ్తే తప్పేంటి. నోరు అదుపలో పెట్టుకో “ అంటూ సామినేని ఉదయభాను వెల్లంపల్లి పై విరుచుకుపడ్డారు. దేవినేని అవినాష్ జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ బర్త్ డే ఫంక్షన్ నుంచి వెళ్లిపోయారు.

ఆకుల శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ కు మింగుడు పడటంలేదు. ఆకుల శ్రీనివాస్ వైసీపీలో యాక్టివ్ అయితే తనకు ఇబ్బంది అవుతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ను ఆకుల శ్రీనివాస్ కలవడం వెల్లంపల్లికి మంటపుట్టించింది. దీనికి కారణమైన సామినేని ఉదయభాను పై ఫైర్ అవ్వడానికి కారణమైంది. ఆకుల శ్రీనివాస్ కూతురి పెళ్లి విషయమై ఆహ్వానానికి సీఎంను కలిశారని చెబుతున్నప్పటికీ.. రాజకీయ కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి కేటాయిస్తారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన ఓట్లు కలిస్తే అక్కడ విజయం సునాయాసం అవుతుంది. దీనిని నివారించేందుకు ఆకుల శ్రీనివాస్ ను పార్టీలోకి తీసుకుంటే బలం మరింత పెరుగుతుందని జగన్ భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రచ్చకెక్కడం కార్యకర్తలకు ఏమాత్రం రుచించడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతర్మథనం చెందుతున్నారు.