Yogi Vemana University: జగన్ సర్కారు ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ఆ పార్టీ వారికే తెలియదు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేశారు. అటు గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లను సైతం విడిచిపెట్టలేదు. బడి, గుడి అన్న తేడా లేకుండా అన్నింటికీ రంగులతో నింపేశారు. చివరకు కోర్టు ఆదేశాలతో తొలగించారు. కానీ అప్పటికే రంగుల రూపంలో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయి. రంగులు అంటేనే ప్రభుత్వ పెద్దల నుంచి కిందిస్థాయి నాయకుల వరకూ పూనకం వచ్చేలా వ్యవహరించి చేతులు కాల్చుకున్నారు. అటు పేర్లు మార్పుతో కూడా సంచలనాలు నమోదుచేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ పేరుతో మార్చి పెను దుమారానికి కారణమయ్యారు. సర్వత్రా విమర్శలను మూటగట్టుకున్నారు. చివరకు సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా అభ్యంతరాలను ఎదుర్కొన్నారు. కానీ మొండి వాడి ముందు వాదన ఎందుకీ పనికి రాకుండా పోయింది.

ఇప్పుడు కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు పెను దుమారానికి దారిదీస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట యోగి వేమన విగ్రహం ఉండేది. దానిని రాత్రికి రాత్రే తొలగించి ఆ స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ హఠాత్ పరిణామంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తమకు ఎంతో గౌరవం ఉందని.. కానీ ఓ మహనీయుడు పేరిట ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం వద్ద ఆయన విగ్రహాన్నే తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ దీనిపై అధికారుల వద్ద ఎటువంటి సమాధానం లేదు.
ఎస్వీయూ పరిధిలో పీజీ సెంటర్ ను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి యోగి వేమన యూనివర్సిటీగా మార్చారు. అన్నిరకాల వసతులు కల్పించారు. అన్నిరకాల కోర్సులు అందుబాటులోకి రాడవతో కడప జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. అది ముమ్మాటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి ఫలితమేనని జిల్లావాసులు భావిస్తున్నారు. కానీ తాజాగా వైసీపీ సర్కారు చర్యలను మాత్రం సమర్థించలేకపోతున్నారు.విగ్రహ మార్పిడితో రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు.

అయితే యూనివర్సిటీ అధికారుల్లో కొందరి చర్యలు వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకరిద్దరు అత్యుత్సాహం ఫలితమే ఇదంటూ వారు చెబుతున్నారు. అయితే విగ్రహ ఏర్పాటుపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లక ముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాజశేఖర్ రెడ్డి అభిమానులు కోరుతున్నారు. తక్షణం యోగి వేమన విగ్రహాన్ని పున ప్రతిష్టించాలని కోరుతున్నారు.